శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 26 జూన్ 2017 (09:28 IST)

ఖజానాకు కన్నం వేస్తున్నది ప్రభుత్వోద్యోగులే అంటే నమ్ముతారా?

ప్రజలు పన్నులు కట్టనందువల్లే, పన్నులు ఏదో రూపంలో ఎగవేయడం వల్లే ప్రభుత్వ రాబడి తగ్గిపోతోందని పాలకులు నానా యాగీ చేయడం చూస్తూనే ఉన్నాం. కానీ ప్రభుత్వ రాబడికి కన్నం వేస్తున్నది, ఖజానాకు చిల్లు పెడుతున్నది ప్రభుత్వ ఉద్యోగులే అంటే నమ్ముతారా.. అందులోనూ ముని

ప్రజలు పన్నులు కట్టనందువల్లే, పన్నులు ఏదో రూపంలో ఎగవేయడం వల్లే ప్రభుత్వ రాబడి తగ్గిపోతోందని పాలకులు నానా యాగీ చేయడం చూస్తూనే ఉన్నాం. కానీ ప్రభుత్వ రాబడికి కన్నం వేస్తున్నది, ఖజానాకు చిల్లు పెడుతున్నది ప్రభుత్వ ఉద్యోగులే అంటే నమ్ముతారా.. అందులోనూ మునిసిపాలిటీల పరిధిలో పది లక్షల వ్యాపార కేంద్రాలకూ, బడ్డీ కొట్టు వ్యాపారులకు లైసెన్సులు ఇవ్వకుండా నెలవారీ లంచాలు పుచ్చుకుని అటు ప్రభుత్వాన్నీ, ఇటు అవగాహన లేని ప్రజలను గుండు కొట్టిస్తున్న శాల్తీలు సాక్షాత్తూ ప్రభుత్వ ఉద్యోగులే అని తేలిపోయింది. ఆంధ్రప్రదేశం వంటి ఒక రాష్ట్రంలోనే 10 లక్షల వ్యాపార కేంద్రాలు లైసెన్స్ మాటే ఎత్తకుండా చిల్లర వ్యాపారం చేస్తూ, మామూళ్లు సమర్పించుకుంటా ప్రభుత్వానికి నయా కాసు పన్ను చెల్లించకుండా బతికేస్తున్నాయంటే లోపం ఎవరిదో వివరంగా చెప్పాలా?
 
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు పక్కన బజ్జీ కొట్ల నుంచి పెద్ద పెద్ద షాపింగ్‌ మాల్స్‌ వరకూ సుమారు 16 లక్షల వరకూ వ్యాపార కేంద్రాలు ఉన్నాయని, వారిలో 6 లక్షలకు మాత్రమే ట్రేడ్‌ లైసెన్సులు ఉన్నట్టు మున్సిపల్‌ అధికార వర్గాలు తెలిపాయి. వ్యాపారం నిర్వహించే ప్రతి ఒక్కరూ విధిగా ట్రేడ్‌ లైసెన్సు తీసుకోవాలి. ఒక వేళ చిన్న వ్యాపారులు లైసెన్సు తీసుకోకపోయినా ప్రభుత్వ ఉద్యోగులే వారి వద్దకు వెళ్లి ఇవ్వాలి. అయితే.. లైసెన్సులు ఇవ్వడం మానేసిన ఉద్యోగులు.. మామూళ్లు తీసుకోవడం మొదలుపెట్టారు.
 
ట్రేడ్‌ లైసెన్సులపై చిరు వ్యాపారులకు అవగాహన లేకపోవడం మున్సిపాలిటీ ఉద్యోగులకు వరంగా మారింది. వ్యాపారులకు ట్రేడ్‌ లైసెన్సులు ఇవ్వకుండా మామూళ్లతో జేబులు నింపుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రధానంగా మున్సిపాలిటీల పరిధిలో ఉండే చిన్న వ్యాపారుల నుంచి భారీగా వసూళ్లు చేస్తున్నారు. వ్యాపారులు ట్రేడ్‌ లైసెన్సుకు అయ్యే సొమ్ము కంటే భారీగా మామూళ్ల కింద ఇవ్వాల్సి వస్తోంది. వ్యాపారులకు అవగాహన కల్పించి 24 గంటల్లోగా లైసెన్సు మంజూరు చేయాల్సి ఉద్యోగులే.. మామూళ్లకు అలవాటుపడి రాష్ట్ర ఖజానాకు గండికొడుతున్నారు.
 
మామూళ్లు ఇవ్వకపోతే చిరు వ్యాపారులకు బెదిరింపులు తప్పడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా వ్యాపారుల నుంచి వసూళ్ల సొమ్ము కోట్ల రూపాయల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో రోడ్డు పక్కన చెరకురసం బండి నడుపుతుంటే సంవత్సరానికి ట్రేడ్‌ లైసెన్సుకింద రూ.165 మాత్రమే చెల్లించాలి. కానీ ఉద్యోగులు అతనికి లైసెన్సు ఇవ్వకుండా మూన్నెళ్లకోసారి వంద రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారు. విజయవాడలోనే ఇలా మామూళ్లు చెల్లించే చిన్న చిన్న వ్యాపారులు వేలల్లో ఉన్నారు. అంటే అటు ప్రభుత్వమూ, ఇటు వ్యాపారులూ ఇద్దరూ ఉద్యోగుల దందా కారణంగా ఆర్థికంగా నష్టపోతున్నారు.
 
ఇదిలా ఉండగా, ట్రేడ్‌ లైసెన్సుల మామూళ్లతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతున్నట్టు అధికార వర్గాలే చెబుతున్నాయి. వ్యాపారులందరికీ లైసెన్సులు జారీచేస్తే ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుంది. మామూళ్లతో అటు మున్సిపాలిటీలూ, ఇటు చిరువ్యాపారులూ ఆర్థికంగా నష్టపోతుండగా, ఉద్యోగులు మాత్రం జేబులు నింపుకుంటున్నారు.