శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 23 నవంబరు 2016 (19:35 IST)

హైస్కూల్ విద్యార్ధులకు మల్టీ స్కిల్ ఫౌండేషన్ కోర్స్

హైస్కూల్ విద్యార్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓ కొత్త కోర్సు ప్రారంభించింది. మల్టీ స్కిల్ ఫౌండేషన్ కోర్స్.. అనేది ఈ కోర్సు పేరు. వివిధ వృత్తి విద్యల్లో హైస్కూల్ స్థాయి విద్యార్ధులకు ప్రాథమిక శిక్షణ ఇప్పించడమే ఈ కోర్సు లక్ష్యం. ఎనిమిదివ తరగతి నుంచి 12వ

హైస్కూల్ విద్యార్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓ కొత్త కోర్సు ప్రారంభించింది. మల్టీ స్కిల్ ఫౌండేషన్ కోర్స్.. అనేది ఈ కోర్సు పేరు. వివిధ వృత్తి విద్యల్లో హైస్కూల్ స్థాయి విద్యార్ధులకు ప్రాథమిక శిక్షణ ఇప్పించడమే ఈ కోర్సు లక్ష్యం. ఎనిమిదివ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్ధుల వరకు ఈ కోర్సులో శిక్షణ ఇప్పిస్తుంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 470 హైస్కూళ్లలో ఈ కోర్సును ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్ట్ కింద ఇప్పటికే కొన్ని గిరిజన ప్రాంతాల్లోని స్కూళ్లు, మోడల్ స్కూళ్లను కలుపుకుని మొత్తం 40 హైస్కూళ్లలో ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తోంది. వచ్చే మార్చినాటికి మిగిలిన అన్ని స్కూళ్లలోనూ మల్టీ స్కిల్ ఫౌండేషన్ కోర్సు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే జరిగితే.. వచ్చే ఏడాది నాటికి కనీసం ఐదు లక్షల మంది విద్యార్ధులకు ఆయా వృత్తి విద్యల్లో శిక్షణ ఇచ్చినట్లవుతుంది.
 
గిరిజన ప్రాంతాల విద్యార్ధులను దృష్టిలో పెట్టుకుని ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఈ కోర్సును రూపొందించింది. ఆర్ధిక సమస్యలు, చదువు అబ్బకపోవడం వంటి అనేక కారణాలు గిరిజన ప్రాంత విద్యార్ధుల్లో డ్రాపౌట్స్ ను పెంచుతున్నాయి. ఈ తరహా సమస్యలతో విద్యార్ధులు చదువుకు దూరమైనప్పటికీ.. అప్పటికే స్కూల్లో మల్టీ స్కిల్ ఫౌండేషన్ కోర్స్ పేరుతో వివిధ వృత్తుల్లో శిక్షణ తీసుకున్న అనుభవం ఉంటుంది కాబట్టి.. వారి భవిష్యత్తుకు ఇబ్బంది ఉండదన్నది స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఉద్దేశ్యం. గిరిజన ప్రాంతాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా డ్రాపౌట్స్ ఉంటున్నారు కాబట్టి.. ఈ కోర్సు అన్ని స్కూళ్లకు విస్తరింపజేయాలని నిర్ణయించారు.
 
మల్టీ స్కిల్ ఫౌండేషన్ కోర్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం.. అమృత యూనివర్శిటీ వంటి నాలుగైదు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఆయా యూనివర్శిటీల్లో వివిధ రకాల సాంకేతిక కోర్సులు చదువుతున్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్.. ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం కింద 11 నెలల పాటు మల్టీ స్కిల్ ఫౌండేషన్ కోర్సుల్లో హైస్కూల్ విద్యార్ధులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఇంటర్న్ షిప్ పూర్తి చేసిన యూనివర్శిటీ విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం సర్టిఫికెట్ ఇస్తుంది. మరోవైపు విద్యార్ధులకు కావాల్సిన సాంకేతిక శిక్షణా అందుతుంది. అంటే.. ఒకే ఒప్పందంతో రెండు ప్రయోజనాలన్నమాట. దీని వల్ల ప్రభుత్వానికి అయ్యే ఖర్చు కూడా పెద్దగా ఉండదు. దీంతో ఈ కోర్సును యుద్ధప్రాతిపదికన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హైస్కూళ్లలో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
 
మల్టీ స్కిల్ ఫౌండేషన్ కోర్స్ కాబట్టి.. విద్యార్ధులు తమకు నచ్చిన, ఆసక్తి ఉన్న అంశాల్లో శిక్షణ పొందవచ్చు. సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రిసిటీ, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయం ఇలా ఏ రంగంలోనైనా విద్యార్ధులు శిక్షణ తీసుకోవచ్చు. ఈ కోర్సుల్లో సబ్జెక్టుల బోధనతో పాటు ప్రాక్టికల్ శిక్షణ కూడా ఉంటుంది. దీంతో 12వ తరగతి పూర్తయ్యే నాటికి విద్యార్ధులు దాదాపు ఐటీఐ విద్యార్ధులతో సమానంగా సాంకేతికాంశాల్లో శిక్షణ పూర్తి చేసుకున్నవాళ్లవుతారు. ఆ తరువాత ఉన్నత చదువుల్లో వాళ్లు ఏ డిగ్రీలు చదవాలన్నా, మరే కోర్సులు చేయాలన్నా హైస్కూల్ స్థాయిలో నేర్చుకున్న అంశాలతో వారికి అవగాహన వచ్చేస్తుంది. ఒక రకంగా విద్యార్ధులు ఏ రంగాల్లో స్థిరపడాలన్నదానిపై హైస్కూల్ స్థాయిలోనే పునాది వేసుకోవచ్చు. ఒకవేళ విద్యార్ధులు చదువు మానేయాల్సి వచ్చినా.. స్కూల్లో తాము నేర్చుకున్నశిక్షణతోనే ఆయా వృత్తుల్లో స్థిరపడిపోవచ్చు.
 
ఇదే కోర్సులో భాగంగా వ్యవసాయ రంగంలో కూడా శిక్షణ ఇప్పించాలనుకుంటోంది ప్రభుత్వం. ఉద్యానవనాల నిర్మాణం, కూరగాయల పెంపకం, ఇతర పంటలు వేసే విధానం, వాటికి కావాల్సిన ఎరువులు, సస్యరక్షణ చర్యలు, పురుగు మందుల మోతాదు వంటి అనేక అంశాలపై శిక్షణ ఇప్పిస్తారు. దీనివల్ల వ్యవసాయం చేసేవాళ్ల సంఖ్య తగ్గిపోకుండా అడ్డుకట్ట వేసినట్లవుతుంది. మరోవైపు సాంకేతిక అంశాల్లోనూ శిక్షణ పొందడం వల్ల.. అధునాతన పద్దతుల్లో తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేయడమెలాగో విద్యార్ధులు నేర్చుకున్నట్లవుతుంది. మధ్యాహ్న భోజనానికి కావాల్సిన కూరగాయలను స్కూళ్లలోనే పండించుకోవాలని ప్రభుత్వం చెబుతోంది కాబట్టి.. ఈ రకంగానూ మల్టీ స్కిల్ ఫౌండేషన్ కోర్స్.. విద్యార్ధులకు ఉపయోగపడుతుంది.