శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (07:22 IST)

విలీనం అవసరం ఏమిటి? .. పన్నీర్, పళని వర్గాల మధ్య ప్రతిష్టంభన

శరవేగంగా మారిన తమిళనాడు రాజకీయ పరిణామాలు గురువారం కాస్త ప్రతిష్టంభనకు గురయ్యాయి. మన్నార్ గుడి మాఫియాను పార్టీనుంచి, ప్రభుత్వం నుంచి వెలివేయడం, తదనంతరం పన్నీర్, ఎడపాడి వర్గాలు ఏకంకావడం ద్వారా అన్నాడీఎంకేను కాపాడుకోవాలనే ప్రయత్నాలు గురువారం ప్రారంభమయ్య

శరవేగంగా మారిన తమిళనాడు రాజకీయ పరిణామాలు గురువారం కాస్త ప్రతిష్టంభనకు గురయ్యాయి. మన్నార్ గుడి మాఫియాను పార్టీనుంచి, ప్రభుత్వం నుంచి వెలివేయడం, తదనంతరం పన్నీర్, ఎడపాడి వర్గాలు ఏకంకావడం ద్వారా అన్నాడీఎంకేను కాపాడుకోవాలనే ప్రయత్నాలు గురువారం ప్రారంభమయ్యాయి. విలీనంపై ఇరువర్గాలు  ఎవరికి వారు తమ వర్గీయులతో సమావేశమై తాజా పరిస్థితిని సమీక్షించుకున్నారు. మరోవైపున మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం తన వర్గం ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర సీనియర్‌ నేతలతో 2 గంటల పాటు సమావేశమయ్యారు. ఎడపాడి వర్గం మంత్రులు, లోక్‌సభ ఉపసభాపతి తంబిదురై చర్చలు జరిపారు. పన్నీర్‌ సెల్వం వర్గం షరతులన్నీ ఆమోదించడమా, మానడమా అని ఎడపాడి వర్గం మీమాంసలో పడిపోయింది. శుక్రవారం నుంచి తుది చర్చలు ప్రారంభించే అవకాశం ఉంది.
 
పన్నీర్‌సెల్వం నిబంధనల్లో ఒకటైన శశికళ కుటుంబాన్ని దూరం పెట్టడం పూర్తయింది. జయ నివాసాన్ని స్మారక భవనంగా మార్చడం, పన్నీర్‌ వర్గాన్ని మంత్రి వర్గంలో చేర్చుకోవడం వరకు ఎడపాడి వర్గం సమ్మతిస్తోంది. అయితే పన్నీర్‌సెల్వంను సీఎం చేయాలన్న నిబంధనపై ఎడపాడి వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పన్నీర్‌సెల్వంతో అత్యవసరంగా చేతులు కలపాల్సిన అవసరం ఏమొచ్చిందని ఎడపాడి వర్గానికి చెందిన మరో సీనియర్‌ నేత నిలదీస్తున్నారు.
 
అన్నాడీఎంకేలోని 2 వర్గాలు ఏకం కావడంపై సీఎం పళనిస్వామి మాత్రం నోరు మెదపడంలేదు. ఇరు వర్గాల విలీనంపై గురువారం మీడియా ప్రతినిధులు సీఎంను ప్రశ్నించగా...‘ఇది ప్రభుత్వ కార్యక్రమం, పార్టీ గురించి ప్రశ్నలు వద్దు’ అంటూ దాటవేశారు. మరోవైపు శశికళ, దినకరన్‌లను పార్టీ నుంచి బహిష్కరింపచేయడం ధర్మయుద్ధంలో తమ తొలి విజయమని పన్నీర్‌ చేసిన ప్రకటనను మంత్రి జయకుమార్‌ ఖండించారు.
 
అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రం కుట్రపన్నిందని మంత్రి వీరమణి ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఉప సభాపతి తంబిదురై, మంత్రి జయకుమార్‌ వేర్వేరుగా తమిళనాడు ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌రావును చెన్నై రాజ్‌భవన్‌లో కలుసుకున్నారు. గవర్నర్‌కు కలసిన అనంతరం తంబిదురై సీఎంతో రహస్య చర్చలు జరిపారు.