శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 21 జులై 2017 (05:39 IST)

జైలులో రాజభోగాలతో నిండా మునిగిపోయిన చిన్నమ్మ.. కుటుంబం మొత్తాన్ని ఇరికించేసిందా?

జైలులో లగ్జరీ జీవితం గడిపేందుకు శశికళ బృందం జైలులోని ఉన్నతాధికారులకే కోట్ల రూపాయలు లంచంగా ఎరవేసినట్లుస్వయంగా జైళ్ల శాఖ అధికారి రూప సంచలన ప్రకటన చేయడం చర్చకు దారితీసింది. ఈ వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి వినయ్‌కుమార్‌ నేతృత్వ

నేనొక్కడినే పోతే ఎలా.. నాతోపాటు అందరినీ లాగితే కదా పండగ చేసుకునేది అని వెనకటికి ఎవడో అన్నాడట. అక్రమాస్తుల కేసులో శిక్షపడి కర్నాటక జైలులో ఉన్న అన్నాడీఎంకే అధినేత శశికళ వ్యవహారం సరిగ్గా ఇలాగే ఉంది. శశికళతో పాటు శిక్ష అనుభవిస్తున్న ఆమె బృందం పరప్పన అగ్రహార జైలులో కనీవినీ ఎరుగని సౌకర్యాలను నేరుగా తన సెల్‌లోకే తెప్పించుకున్నట్లు బయటపడి సంచలనం కలిగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ వ్యవహారం బయట ఉన్న ఆమె కుటుంబీకుల మెడకు కూడా చుట్టుకునే ప్రమాదం ఎదురు కానుంది.
 
 
జైలులో లగ్జరీ జీవితం గడిపేందుకు శశికళ బృందం జైలులోని ఉన్నతాధికారులకే కోట్ల రూపాయలు లంచంగా ఎరవేసినట్లుస్వయంగా జైళ్ల శాఖ అధికారి రూప సంచలన ప్రకటన చేయడం చర్చకు దారితీసింది. ఈ వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి వినయ్‌కుమార్‌ నేతృత్వంలో 25 మందితో కూడిన బృందం రంగంలోకి దిగింది.ఈ బృందం తొలి విడత విచారణను బెంగళూరులో ముగించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. 
 
కర్ణాటక ప్రభుత్వానికి రూప రాసిన లేఖ, జైలులో సాగిన విచారణ, అధికారుల మీద నిఘా వెరసి ఈ బృందానికి కొన్ని కీలక సమాచారాలు, ఆధారాలు లభించినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఆమేరకు ఈ విచారణ వలయంలోకి చిన్నమ్మ ఫ్యామిలీని తీసుకొచ్చేందుకు ఆ బృందం నిర్ణయించినట్టు బెంగళూరు నుంచి సమాచారం వస్తోంది.
 
శశికళ కుటుంబాన్ని గురిపెట్టి వినయ్‌కుమార్‌ బృందం విచారణకు సిద్ధం అవుతున్న సమాచారం తమిళనాట ఉత్కంఠ రేపుతోంది. ఆ ఫ్యామిలీలో చిక్కేదెవ్వరో అన్న చర్చ సాగుతోంది. శశికళతో ములాఖత్‌ నిమిత్తం కుటుంబీకులు తరచూ వెళ్లి వస్తున్నారు. అయితే, అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ వెళ్లి రావడం మాత్రం అధికారికంగా వెలుగులోకి వస్తున్నాయి. మిగిలిన వారు చడీచప్పుడు కాకుండా ములాఖత్‌ అవుతున్నారు. 
 
ఈ దృష్ట్యా, శశికళతో ములాఖత్‌ అయిన వారి వివరాల ఆధారంగా చెన్నైలో విచారణకు ఆ బృందం కసరత్తులు చేస్తున్నట్టు తెలిసింది. ఇందులో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, పలువురు అన్నాడీఎంకే ముఖ్య నాయకులు కూడా ఉన్నట్టు తెలిసింది. వీరు తరచూ శశికళతో భేటీ కావడంతో పాటుగా ఓ ఎమ్మెల్యే సన్నిహిత కన్నడ హాస్య నటుడి ద్వారా పూర్తి రాయబారాలు సాగినట్టు విచారణ బృందానికి సమాచారం అందినట్టు తెలిసింది.
 
అలాగే, ఓ ప్రైవేటు బ్యాంక్‌లో నగదు డ్రా సాగినట్టుగా లభించిన వివరాల మేరకు చెన్నైలో పర్యటించి తమ విచారణ సాగించేందుకు ఆ బృందం సిద్ధం అవుతున్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. దీంతో అన్నాడీఎంకే వర్గాల్లో ఉత్కంఠ బయలు దేరింది. ఆ ప్రముఖులు ఎవరో, ఆ ఎమ్మెల్యే ఎవరో అన్న చర్చ హోరెత్తుతోంది.  ఇక, గురువారం ఉదయాన్నే దినకరన్‌ బెంగళూరుకు పయనం కావడం గమనార్హం. అక్కడ చిన్నమ్మతో ఆయన ములాఖత్‌ అయినట్టు సమాచారం. 
 
చిన్నమ్మకు లగ్జరీ జీవితం జైలులో దక్కే రీతిలో రూ.కోట్లను అధికారులకు లంచంగా ఇచ్చిన వ్యవహారంలో ఈ ఫ్యామిలీ కీలక పాత్ర పోషించి ఉండొచ్చని, అన్నాడీఎంకేలో మిత్రపక్షంగా ఉన్న ఓ  ఎమ్మెల్యేతో పాటుగా కొందరు ముఖ్య నాయకుల హస్తం మీద విచారణ బృందం అనుమానం వ్యక్తంచేస్తున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. రూ.కోట్లు ఎలా వచ్చాయి.. ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎవరి ద్వారా అధికారులకు అప్పగించారు.. బ్యాంకుల ద్వారా జమ చేశారా.. లేదా స్వయంగా అందించారా.. తదితర ఆరోపణలపై విచారణ సాగించి అనుమానాల్ని నివృతి చేసుకునేందుకు వినయ్‌కుమార్‌ బృందం సిద్ధం అవుతున్నట్టు తెలిసింది.