గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 11 జులై 2017 (03:18 IST)

రవిశాస్త్రికి మళ్లీ మొండి చెయ్యేనా.. కోహ్లీకి చురకలంటించిన గంగూలీ

భారత క్రికెట్ చీఫ్ కోచ్ ఎంపికకు సంబంధించిన ప్రధాన ఘట్టం ముగిసింది. సోమవారం కొత్త కోచ్ ఎంపికకోసం జరిగిన ఇంటర్వ్యూలకు ఐదుగురు హాజరయ్యారు. అయితే వీరిలో ఎవరిని కోచ్‌గా నియమించాలో ప్రకటించడంలో క్రికెట్ సలహా కమిటీ సీఏసీ ఎలాంటి తొందరపాటును ప్రదర్శించడం లేదు

భారత క్రికెట్ చీఫ్ కోచ్ ఎంపికకు సంబంధించిన ప్రధాన ఘట్టం ముగిసింది. సోమవారం కొత్త కోచ్ ఎంపికకోసం జరిగిన ఇంటర్వ్యూలకు ఐదుగురు హాజరయ్యారు. అయితే వీరిలో ఎవరిని కోచ్‌గా నియమించాలో ప్రకటించడంలో క్రికెట్ సలహా కమిటీ సీఏసీ ఎలాంటి తొందరపాటును ప్రదర్శించడం లేదు. విశ్వసనీయమైన వార్తల ప్రకారం ఈసారీ కోహ్లీ మెచ్చిన రవిశాస్త్రికి కోచ్ అయ్యే ఛాన్స్ లేదని తెలుస్తోంది. బీసీసీఐలోని ఒక వర్గం చెబుతున్న ప్రకారం... కోహ్లి ముందు సీఏసీ రెండు ప్రత్యామ్నాయాలు ఉంచి అందులో ఒకరిని ఎంపిక చేసుకోమని కోరుతున్నట్లు సమాచారం. అయితే అందులో శాస్త్రి పేరు కాకుండా సెహ్వాగ్, టామ్‌ మూడీ పేర్లు ఉన్నాయని వారు అంటున్నారు!
 
ఇదే కనుక నిజమైతే టీమిండియా కెప్టెన్ కోహ్లీకి ఇంతకుమించిన అవమానం మరొకటి ఉండదు. భారతీయ క్రికెట్‌లో జెంటల్మన్‌గా పేరొందిన అనిల్ కుంబ్లేని కోచ్ పదవి నుంచి అవమానకరంగా పంపించి తన స్థానంలో రవిశాస్త్రిని ఎంపిక చేసుకుని తానాడింది ఆటా పాడింది పాటగా చేసుకోవాలనుకున్న కోహ్లీకి ఎదురు దెబ్బ తగిలినట్లే. పైగా కోచ్‌ ఎంపికకు ఇంటర్వ్యూలు పూర్తయిన తర్వాత మీడియా సమావేశంలో సలహామండలి సభ్యుడు గంగూలీ అంటించిన చురకలు చూస్తే కోహ్లీని సలహామండలి అడ్డంగా ఇరికించబోతోందని స్పష్టమవుతోంది.
 
సీఏసీ నిర్వహించిన ఇంటర్వ్యూలకు ఐదుగురు అభ్యర్థులు హాజరయ్యారు. రవిశాస్త్రి, వీరేంద్ర సెహ్వాగ్, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ (భారత్‌), టామ్‌ మూడీ (ఆస్ట్రేలియా), రిచర్డ్‌ పైబస్‌ (దక్షిణాఫ్రికా)లు తమ శిక్షణ, ప్రణాళికల గురించి వివరించారు. మరో అభ్యర్థి ఫిల్‌ సిమన్స్‌ (విండీస్‌) మాత్రం ఇంటర్వ్యూకు రాలేదు. సెహ్వాగ్‌ ఇంటర్వ్యూ రెండు గంటలకు పైగా సాగింది. అభ్యర్థుల ప్రజెంటేషన్‌ విషయంలో అంతా గత ఏడాది తరహాలోనే సాగిందని గంగూలీ చెప్పారు
 
ప్రస్తుతానికి తాము కోచ్‌ పేరును ప్రకటించడం లేదని, దీనిపై మరింత చర్చ జరగాల్సి ఉందని సీఏసీ సభ్యుడు సౌరవ్‌ గంగూలీ స్పష్టం చేశారు. ‘కోచ్‌ పేరును ఇప్పుడే ప్రకటించడం లేదు. కొన్ని రోజుల సమయం ఇంకా అవసరం ఉంది కాబట్టి ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నాం. ఎంపికకు తొందరేమీ లేదని మా అభిప్రాయం. ఈసారి ఎవరి పేరును ప్రకటించినా వారు 2019 వరల్డ్‌ కప్‌ వరకు కొనసాగుతారు’ అని గంగూలీ స్పష్టం చేశారు.
 
‘కోచ్‌ ఎవరితో కలిసి పని చేయాల్సి ఉంటుందో అలాంటి వారితో మాట్లాడటం కూడా చాలా అవసరం. అతను 2019 ప్రపంచ కప్‌ వరకు ఉండాల్సి ఉంటుంది. ఆరు నెలల తర్వాత అభిప్రాయ భేదాలు రాకూడదు కదా. ఎంపికతో మా పాత్ర ముగిసిపోతుంది కానీ జట్టును ముందుకు నడిపించాల్సింది కెప్టెన్, కోచ్, ఆటగాళ్లు మాత్రమే’ అని ‘దాదా’ చెప్పారు. అలాగే ‘కోచ్‌లు ఎలా పని చేస్తారో కూడా కోహ్లి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది’ అంటూ పరోక్షంగా చురక కూడా అంటించారు.
 
ఇంటర్వ్యూకు ముందు వరకు కూడా రవిశాస్త్రి కోచ్‌గా ఎంపికవుతారని అందరూ భావిస్తూ వచ్చారు. అయితే అంతర్గత సమాచారం ప్రకారం ఇంటర్వ్యూలు ముగిశాక రవిశాస్త్రికి మరీ అనుకూల వాతావరణం ఏమీ లేదు. అసలు కోచ్‌ పేరును నేరుగా ప్రకటించకుండా కోహ్లిని భాగస్వామిగా చేయడంలోనే సీఏసీ చాలా తెలివిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఇది పూర్తిగా తమ నిర్ణయం కాదని, రేపు కుంబ్లే తరహాలో ఏదైనా జరిగితే కోహ్లిదే బాధ్యత అని కమిటీ చెప్పకనే చెప్పింది.