గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: బుధవారం, 25 ఏప్రియల్ 2018 (12:51 IST)

తిరుపతిలో జగన్ మోహన్ రెడ్డి పక్కా స్కెచ్.. ఏం చేయబోతున్నారు?

తిరుపతిలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా... అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి కొంతమంది సీనియర్ నేతలు వెళ్ళిపోతున్నారు. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో నేతలు పార్టీ మారుతుండటం క్యాడర్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టిటిడి మాజీ ఛైర్మన్

తిరుపతిలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా... అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి కొంతమంది సీనియర్ నేతలు వెళ్ళిపోతున్నారు. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో నేతలు పార్టీ మారుతుండటం క్యాడర్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టిటిడి మాజీ ఛైర్మన్ చదలవాడ క్రిష్ణమూర్తి వైసిపి వైపు చూడటానికి కారణాలేంటి..? 
 
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో రాజకీయ హడావిడి పెరిగింది. ఎన్నికల సమీపిస్తున్నవేళ సీట్ల కోసం నాయకులు పాకులాడుతున్నారు. అదే టైంలో పార్టీలు కూడా ఎవరికి సీటిస్తే గెలుపు అవకాశాలు ఉంటాయన్న దానిపై కసరత్తు మొదలెట్టారు. ఈ నేపథ్యంలో కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉన్న తిరుపతిలో ఆ సామాజిక వర్గం వ్యక్తిని బరిలో దింపడం కోసం వైసిపి ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. అయితే పార్టీలో సీనియర్ నేతగా జగన్ మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్‌గా చెప్పుకునే కరుణాకర్ రెడ్డి అందుకు ఒప్పుకుంటారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.
 
ఇప్పటికే టిడిపి అధికంగా ఉన్న కాపులకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు మరో బలమైన సామాజికవర్గంగా చెప్పుకునే బిసి నాయకులు నరసింహయాదవ్‌కు తుడా ఛైర్మన్ పదవి ఇచ్చారు. దీంతో తిరుపతి అసెంబ్లీ స్థానంలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే ఈ రెండు సామాజిక వర్గాలు టిడిపికి బాగా పనిచేస్తున్నాయన్న సమాచారంతోనే జగన్ ఈ నిర్ణయానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అయితే అందుకు స్థానిక రాజకీయ సమీకరణాలు ఎందుకు కలిసి వస్తాయన్నది చర్చనీయాంశంగా మారింది. 
 
టిడిపి సీనియర్ నాయకుడిగా ఉండి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో పాటు టిటిడి ఛైర్మన్‌గా కూడా చేసిన చదలవాడ క్రిష్ణమూర్తిని వైసిపిలోకి తీసుకునే ఆలోచనలో ఉన్నారు జగన్. అలా చేయడం ద్వారా కాపు సామాజిక వర్గానికి చెందిన చదలవాడ క్రిష్ణమూర్తికి టిక్కెట్ ఇవ్వడంతో పాటు టిడిపి నుంచి కొంతమంది చదలవాడ వర్గాన్ని వైసిపిలోకి లాగే ఆలోచన చేస్తున్నారు. అందుకు చదలవాడ కూడా సిద్థంగా ఉన్నట్లు తెలుస్తోంది. 
 
ఇప్పటికే ఈ విషయంపై చర్చలు మొదలయ్యాయి. కాకపోతే కరుణాకర్ రెడ్డి లాంటి సీనియర్ లీడర్‌ను నచ్చజెప్పి చదలవాడను పార్టీలోకి తీసుకోవాలన్న ప్రయత్నాల్లో ఉంది వైసిపి. టిక్కెట్ల విషయంలో రాష్ట్రవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక స్ట్రాటజీని అమలుచేసే పనిలో ఉన్న వైసిపి పొలిటికల్ అడ్వైజర్ ప్రశాంత్ కిషోర్ టీం సూచనలను కూడా పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. పి.కె. టీం నిర్వహించిన సర్వేలో భాగంగానే చదలవాడ క్రిష్ణమూర్తిని పార్టీలోకి చేర్చుకోవాలన్న ఆలోచనలోకి వచ్చారట నాయకులు. 
 
బలమైన నాయకుడిగా కరుణాకర్ రెడ్డి ఉన్నప్పటికీ రెడ్డి సామాజికవర్గం చాలా తక్కువ కావడం వల్లే గెలవలేకపోతున్నారన్న అంచనాకు వచ్చింది పికె టీం. సామాజిక సమీకరణంలో బ్యాలెన్స్ చేయడం వల్లనే తిరుపతి స్థానాన్ని కైవసం చేసుకోగలమని భావిస్తున్నారు. దానికితోడు సీనియర్‌గా ఉన్న కరుణాకర్ రెడ్డి ద్వితీయ శ్రేణి నాయకులుగా ఉన్న వారిని ఎదగనీయకుండా తొక్కేస్తున్నారన్న సమాచారం కూడా జగన్‌కు చేరినట్లు తెలుస్తోంది. తిరుపతిలో టిడిపిని దెబ్బకొట్టడంలో భాగంగానే చదలవాడను పార్టీలోకి తీసుకోవాలన్న అభిప్రాయంలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. దానికి లోకల్‌గా ఉన్న క్యాడర్ నుంచి కూడా మంచి స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది.
 
కాపు సామాజిక వర్గానికే తిరుపతి టిక్కెట్టు ఇవ్వాలని జగన్ భావించే నేపథ్యంలో అందుకు చదలవాడే సరైన నాయకుడున్న అభిప్రాయం వినిపిస్తోంది. రాజకీయంగా అనుభవం ఉండడంతో పాటు ఆర్థికంగా కూడా బలంగా ఉన్న చదలవాడకు వైసిపి క్యాడర్ తోడైతే గెలుపు కన్ఫామ్ అన్నది వైసిపి అంచనాగా తెలుస్తోంది.