గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 3 మార్చి 2016 (09:31 IST)

ఉత్తర కొరియాపై ఐక్యరాజ్య సమితి కొరడా... కఠిన ఆంక్షలు

ప్రపంచ దేశాలను ధిక్కరించి ఇష్టానుసారంగా అణు పరీక్షలు జరుపుతున్న ఉత్తర కొరియాపై ఐక్యరాజ్య సమితి కొరడా ఝుళిపించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశమై ఉత్తర కొరియాపై ఆంక్షలను విస్తరించాలనే తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. కొత్తగా విధించిన ఆంక్షలు మరింత కఠినంగా ఉండనున్నాయి. ఇటీవల ఉత్తర కొరియా నిర్వహించిన హైడ్రోజన్ పరీక్షకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకుంది. 
 
ఆ దేశం నుంచి బయటకు వచ్చే సరకులు.. లోపలికి పోయే సరకులను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. దీంతో పాటు కొత్తగా కొంతమంది వ్యక్తులు.. సంస్థల్ని కూడా నిషేధిత జాబితాలోకి చేర్చారు. ఆ దేశానికి వెళ్లే చిన్న ఆయుధాలపైనా నిషేధం విధించారు. తనిఖీల సందర్భంగా ఇటువంటి ఆయుధాలు ఆ దేశానికి చేరకుండా చూస్తారు. 
 
కాగా, ఉత్తర కొరియాపై ఐరాస ఆంక్షలను విధించడం పట్ల అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హర్షం వ్యక్తం చేశారు. ఉత్తర కొరియా ప్రమాదకర అణు కార్యక్రమానికి స్వస్తి చెప్పి తమ ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవాలని హితవు పలికారు. ప్రపంచ దేశాలన్నీ ఇదే కోరుకుంటున్నాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.