శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (22:33 IST)

నాగ్‌ను అలా చూసి ఎమోషన్ అయ్యా... కె.రాఘవేంద్ర రావు ఇంటర్వ్యూ

కమర్షియల్‌ సినిమాలు తీసిన దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఒక్కసారిగా భక్తి చిత్రాలు తీయడంలో ఆంతర్యం ఏమిటనేది చాలమందిలో వుంది. ఎస్‌ఎస్‌సి.. బొటాబొటి మార్కులతో పాసైన నేను ఎలాగొలా డిగ్రీ పూర్తిచేసి సినిమారంగంలోకి వచ్చాను. కానీ ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం

కమర్షియల్‌ సినిమాలు తీసిన దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఒక్కసారిగా భక్తి చిత్రాలు తీయడంలో ఆంతర్యం ఏమిటనేది చాలమందిలో వుంది. ఎస్‌ఎస్‌సి.. బొటాబొటి మార్కులతో పాసైన నేను ఎలాగొలా డిగ్రీ పూర్తిచేసి సినిమారంగంలోకి వచ్చాను. కానీ ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం ఏదో తెలీని ఓ శక్తి కారణమైంది. అదే శ్రీవేంకటేశ్వరుడని నమ్ముతాను. అందుకే నావంతు బాధ్యతగా ఏదో ఒకటి చేయాలని సినిమాలు తీస్తున్నాను. అనుకోనివిధంగా జీవితంలో శ్రీనివాసుడు భాగమైపోయాడనిపిస్తుంది.
 
అన్నమయ్య, శ్రీరామదాసు వంటి ప్రముఖుల గురించి ఇప్పటి తరానికి పెద్దగా తెలీదు. ఇలా ఎందరివో జరిగిన చరిత్ర కథలు మన వద్ద వున్నాయి. వాటిని నాకంటే ఇంకా బాగా తీయగల దర్శకులూ వున్నారు. అలాంటి అవకాశం నాకే వచ్చినందుకు ఆనందంగా వుంది. అయితే హథీరామ్‌బాబా గురించి తెలీని ఎన్నో విషయాలు ఈ సినిమాలో చూస్తారని చెబుతున్నారు. ఈ నెల 10న విడుదల కానున్న 'ఓం నమో వేంకటేశాయ' గురించి ఆయన చెప్పిన విశేషాలు.
 
'అన్నమయ్య'కూ ఈ సినిమాకు తేడా ఏమిటి?
'అన్నమయ్య' పూర్తిగా భక్తుడి కోణంలో నుంచి చెప్పిన కథ. 'ఓం నమో వెంకటేశాయ' కూడా భక్తుడి కోణంలోనే చెప్పినా, ఇందులో వెంకటేశ్వరస్వామితో భక్తుడి స్నేహం అన్న మరో కొత్త కోణం కూడా ఉంది. ఇకపోతే కథ, ఎమోషన్‌ పరంగా రెండూ వేటికవే భిన్నమైన సినిమాలు. ఈ రెండు సినిమాలను అస్సలు పోల్చలేం.
 
హథిరామ్‌ బాబా గురించి సమాచారం చాలా తక్కువ ఉంది కదా? సినిమా ఎలా తీయగలిగారు?
కథకు కావాల్సిన ప్రధాన ఘట్టాలన్నీ తెలిస్తే అది చాలు. మాకు తెలిసిన సమాచారాన్నే తీసుకొని, సినిమాటిక్‌ లిబర్టీతో ఫిక్షన్‌ జతచేశాం. సినిమాలో వచ్చే సన్నివేశాలన్నీ అలాగే జరిగాయని కాదు. మాకు తెలిసిన సమాచారం అల్లిన సన్నివేశాలవి. అన్నమయ్యకు సంబంధించిన పూర్తి కథ ఉన్నా కూడా క్లైమాక్స్‌ను కల్పితం చేసి చెప్పాం. ప్రేక్షకుల్ని మెప్పించాలంటే ఇలాంటి తప్పవు.
 
వద్దన్న నాగార్జునను ఎలా ఒప్పించారు?
నాగార్జున ముందు ఈ సినిమా వద్దనే అన్నాడు. 'అన్నమయ్యతో పోల్చి చూస్తే తేలిపోతాం, అలాంటి క్లైమాక్స్‌ మళ్ళీ రాదు' అన్నాడు. ఎప్పుడైతే పూర్తి స్క్రిప్ట్‌ వినిపించానో అప్పుడు వెంటనే ఒప్పేసుకున్నాడు. అన్నమయ్యలానే ఈ సినిమాకు కూడా క్లైమాక్స్‌నే హైలైట్‌గా చెబుతా.
 
నాగార్జున కాకుండా ఆ పాత్రకు ఇతర హీరోలను ఎవరినైనా ఊహించారా?
ఈ కథ అనుకోగానే నాగార్జున తప్ప ఇంకెవ్వరూ గుర్తురాలేదు. ఆయన కాకుండా ఈ సినిమా ఎవ్వరూ చేయరని నేననడం లేదు. ఆయన ఒప్పుకోకపోతే నేనైతే ఈ సినిమా చేసేవాడ్ని కాదు.
 
నాగార్జునతో నాలుగో భక్తిరస చిత్రం తీయడం ఎలా అనిపించింది?
అవన్నీ ఆ దేవుడే చేయించాడేమో అనిపిస్తూంటుంది. భక్తుడంటే అందరికీ నాగార్జునే గుర్తొస్తారు. ఈ సినిమాలోనూ రామ్‌ బాబాగా ఆయన నటన అద్భుతం. కొన్ని సన్నివేశాలు తీసేప్పుడు నేనే చాలా ఎమోషనల్‌ అయిపోయి కట్‌ కూడా చెప్పేవాడిని కాదు. సెట్లో ఉన్న అందరికీ నాగ్‌ని చూస్తే రామ్‌ బాబాను చూసినట్టే అనిపించేంది. మా కాంబినేషన్‌లో ఇలా ఇన్ని భక్తిరస చిత్రాలు రావడం అదృష్టం.
 
భక్తిరస చిత్రాలు తీయాలంటే మీరే తీయాలన్న పేరొచ్చింది కదా! దాన్నెలా చూస్తారు?
నేనొక్కడినే తీయగలనని ఏమీ లేదు. ఏ దర్శకుడైనా చేయొచ్చు. ఒక్క భక్తిరస చిత్రాలనే కాకుండా నిజ జీవిత కథలు, పురాణాలు.. ఇలా మన సంస్కృతి సాంప్రదాయాలను చాటిచెప్పే కథలు చాలా ఉన్నాయి. ఇప్పుడున్న టెక్నాలజీతో ఇప్పటి దర్శకులంతా ఈ తరహా సినిమాలు చేసేయొచ్చు.
 
ఈ రోజుల్లో ఇలాంటి సినిమా అంటే రిస్క్‌ అనిపించలేదా?
ఏమీ లేదు. నిజం చెప్పాలంటే ఒక మంచి ఎమోషన్‌తో ఓ కథ చెప్తే, అది ఏ జానర్‌ సినిమా అయినా ప్రేక్షకులు చూస్తారు. కమర్షియల్‌ సినిమాలనే ఎక్కువగా ఇష్టపడే యూత్‌ కూడా ఈ సినిమాకు కనెక్ట్‌ అవుతారన్న నమ్మకం ఉంది. ఇప్పటి యూత్‌ దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వారికి మన సంస్కృతి, చరిత్ర పుస్తకాల్లో ఏదో ఒకచోట మాత్రమే వుంటుంది. దాన్ని గొప్పగా చూపించే ప్రక్రియ సినిమా. ఓం నమో వెంకటేశాయ కథ అలాంటిది.
 
మేకింగ్‌ పరంగా తీసుకున్న జాగ్రత్తలు ఏంటి?
చాలా జాగ్రత్తలే తీసుకున్నాం. తిరుమలలో షూటింగ్‌ చేయడానికి అవకాశం లేదు కాబట్టి అందుకోసం కెమెరామేన్‌ ఎస్‌.గోపాల్‌ రెడ్డి, ఆర్ట్‌ డైరెక్టర్‌ కిరణ్‌ కలిసి కొన్ని వేల కిలోమీటర్లు తిరిగి చిక్‌మంగళూరు, మహాబలేశ్వరం లొకేషన్స్‌ను ఎంపిక చేశారు. నేను, రచయిత జేకే భారవి కలిసి ఇక్కడ కాస్ట్యూమ్స్‌, సినిమాటిక్‌గా ఈ కథను ఎలా మార్చొచ్చు అని నిరంతరం కష్టపడుతూ ఉండేవాళ్ళం. సెట్స్‌పైకి వెళ్ళాక ఆ దేవుడి దయవల్లే ఒక్క ఆటంకం కలగకుండా సినిమా పూర్తైంది.
 
సెట్లో అందరూ డ్రెస్‌ కోడ్‌ అవలంభించారు కారణం?
ఇది ప్రత్యేకంగా చెప్పాల్సింది. సెట్లో అన్ని మతాలవారు ఈ సినిమాకు పనిచేశారు. ఎటువంటి భేషజాలు లేకుండా అందరూ నామాలు పెట్టుకుని శుచి శుభ్రతను పాటించి తమ దేవుడి సినిమా చేస్తున్నామన్న భావనతో చేయడంతో అనుకున్నట్లు చేయగలిగాం. అందుకు ప్రకృతి కూడా మాకు సహకరించింది.
 
భక్తుడితో దేవుడు పాచికలు ఆడే సీన్‌ చేసేటప్పుడు ఎలా ఫీలయ్యారు?
అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యాను. పలు దేవాలయ గ్రంథాల్లో లభించిన సన్నివేశాల ఆధారంగా దేవుడు, భక్తుడు కలిసి పాచికలు ఆడే సీన్‌ తీయాలి. దానికోసం 600 ఏళ్లనాటి వాతావరణం కావాలి. అప్పట్లో ఎక్కడచూసిన గ్రీనరీనే వుండేది. ఇప్పుడు అది లోపించింది. అందుకే చూసేవారికి కనెక్ట్‌కావాలి. ఎన్నో ప్రాంతాలను పరిశీలించాం. ఆఖరికి మహేబలేశ్వరంలోనూ చిగ్‌మంగళూరులోనూ ఎత్తైన ప్రాంతాలను ఎంపికచేసి తీశాం.
 
శ్రీవేంకటేశ్వరునిగా సౌరభ్‌ను తీసుకోవడంలో ఆంతర్యం?
నేను పరిశీలించిన గ్రంథాలను బట్టి.. శ్రీవేంకటేశ్వరుడు నవయవ్వనుడు, అలంకారప్రియుడు.. అందగాడు.. అందుకే అటువంటి పాత్ర కోసం వెతుకుతుండగా హిందీలో మహాభారత్‌ సీరియల్‌ చేస్తున్న సౌరభ్‌రాజ్‌ జైన్‌ చూసి పిలిపించి.. నాలుగుసార్లు ఆడిషన్‌ చేసి ఎంపిక చేశాం. తను కరెక్ట్‌గా సరిపోయాడు.
 
దర్శకుడిగా ఇదే మీ చివరిసినిమా అన్న ప్రచారం గురించి ఏమంటారు?
ఇప్పటివరకూ నా జీవితమంతా ఆ దేవుడు చెప్పినట్లే జరుగుతూ వస్తుందనుకుంటున్నా. ఈరోజు ఇంత పెద్ద డైరెక్టర్‌ అయ్యానన్నా అంతా ఆ దేవుడి దయవల్లే. 'ఓం నమో వెంకటేశాయ' నా చివరి సినిమా అని నేను అనుకోవట్లేదు.
 
ఇటీవలే నరసింహస్వామిపై సినిమా తీస్తానన్నారు?
అవును. నేను ఏ దేవాలయానికి వెళ్ళినా.. అక్కడి దేవాదాయ శాఖవారు మా దేవుడిపైనా సినిమా తీయండని అడుగుతున్నారు. అప్పటి పరిస్థితిని బట్టి అలా చెప్పాను. అవకాశం వుంటే చేస్తానేమో చెప్పలేను అని ముగించారు.