శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2018
Written By pnr
Last Updated : బుధవారం, 25 ఏప్రియల్ 2018 (13:01 IST)

ఐపీఎల్ 2018 : బౌలర్ల సూపర్‌ షో.. సన్‌రైజర్స్ అద్భుత గెలుపు

ఇండియ్ ప్రీమియర్ లీగ్ 2018 టోర్నీలో భాగంగా, మంగళవారం రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు సమిష్టిగా రాణించి మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు.

ఇండియ్ ప్రీమియర్ లీగ్ 2018 టోర్నీలో భాగంగా, మంగళవారం రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు సమిష్టిగా రాణించి మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా, ఈ మ్యాచ్‌లో బౌలర్లు అద్భుతంగా రాణించడంతో ఆతిథ్య ముంబై ఇండియన్స్‌ జట్టుకు ఓటమి తప్పలేదు.
 
నిజానికి ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 18.4 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే, పటిష్ట బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ మాత్రం ఈ లక్ష్యాన్ని చేరుకోలేక చతికిలపడింది. తొమ్మిది మంది బ్యాట్స్‌మెన్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడంతో ఓటమి తప్పలేదు. ముఖ్యంగా, తమ మెంటార్‌ మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ టెండూల్కర్‌కు జన్మదిన కానుకగా విజయాన్ని అందిద్దామనుకున్న ఆ జట్టును సన్‌రైజర్స్‌ బౌలర్లు చావుదెబ్బ తీశారు.
 
నిజానికి ఐపీఎల్ 2018 సీజన్‌లో ఇప్పటివరకు నమోదైన అతిస్వల్ప స్కోరు ఇదే కావడం గమనార్హం. దీంతో మ్యాచ్ సాదాసీదాగా ముగుస్తుందని అంతా భావించారు. కానీ పట్టు వీడని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్లు ఊహించని రీతిలో తమ జట్టుకు విజయాన్ని కానుకగా అందించారు. ఆరంభంలో సందీప్‌ (1/9).. ఆ తర్వాత సిద్ధార్థ్‌ కౌల్‌ (3/23), రషీద్‌ (2/11) చెలరేగడంతో ముంబై ఇండియన్స్‌ 119 పరుగుల లక్ష్యాన్ని కూడా సాధించలేకపోయింది. 
 
అంతకుముందు హైదరాబాద్ జట్టు 118 పరుగులు చేసింది. ఇందులో విలియమ్సన్‌ (21 బంతుల్లో 5 ఫోర్లతో 29), యూసుఫ్‌ పఠాన్‌ (33 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 29) మాత్రమే ఆడారు. మెక్లెనగన్‌, హార్దిక్‌, మార్కండేలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 18.5 ఓవర్లలో 87 పరుగులకు కుప్పకూలింది. ఫలితంగా 31 పరుగుల తేడాతో ఓడింది. సూర్యకుమార్‌ (34), క్రునాల్‌ (24) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు.