శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథలు
Written By pnr
Last Updated : బుధవారం, 10 జనవరి 2018 (16:09 IST)

వ్యక్తి వాక్కుతో అతని పదవి.. ప్రతిష్ట ఏంటో తెలుస్తుంది...

ఓ రోజున విక్రమాదిత్య మహారాజు తన సైనికులతోనూ, మంత్రితోనూ కలిసి వేటకై అడవికి వెళ్ళాడు. వేటాడుతూ వేటాడుతూ అడవిలో ఒకరికొకరు దూరమైనారు.

ఓ రోజున విక్రమాదిత్య మహారాజు తన సైనికులతోనూ, మంత్రితోనూ కలిసి వేటకై అడవికి వెళ్ళాడు. వేటాడుతూ వేటాడుతూ అడవిలో ఒకరికొకరు దూరమైనారు. ఒకచోట చెట్టు కింద వృద్ధాప్యంతో బాధపడుతూ ఉండే అంధుడు అయిన ఒక సాధువు కూర్చొని ఉన్నాడు. అతన్ని చూసిన విక్రమాదిత్యుడు 'సాధు మహరాజ్, ఇటువైపుగా ఎవరైనా ఇంతకుముందు వెళ్ళారా!' అని అడిగాడు.
 
ఆ అంధ సాధువు సమాధానమిస్తూ, 'మహారాజా! అందరికంటే ముందు మీ సేవకుడు వెళ్ళాడు. అతని వెనుక మీ సేనా నాయకుడొకడు వెళ్ళాడు. సేనానాయకుని తర్వాత మీ మంత్రి కూడా ఇంతకుముందే వెళ్ళాడు' అని ఆ సాధువు చెప్పాడు. 
 
అంధుడైన ఆ సాధువు చెప్పిన సమాధానం విని విక్రమాదిత్య మహారాజు ఆశ్చర్యంతో, ఆసక్తితో 'మహాత్మా! మీకు నేత్రాలు కనిపించవు కదా! నా సేవకుడు, సేనానాయకుడు, మంత్రి ఇక్కడినుండి ఇప్పుడే వెళ్లినట్లు ఎలా గ్రహించారు? నేను రాజునైనట్లు కూడా ఎలా కనుగొన్నారు?' అంటూ ఆశ్చర్యంతో ప్రశ్నించాడు.
 
దీనికై సాధువు స్పందిస్తూ, 'మహారాజా! నేనా ముగ్గురినీ, మిమ్ములను మీ మాటలు విని కనిపెట్టాను. అందరికంటే ముందు సేవకుడు వచ్చి నాతో, "ఏమిరా, గుడ్డివాడా! ఇటు ఎవరైనా వచ్చారా?" అని అడిగాడు. కొంతసేపటికి సేనానాయకుడు వచ్చి, "సూర్ దాస్, ఇటు ఎవరైనా వెళ్ళారా?"అని అడిగాడు.

చివరకు మీ మంత్రి వచ్చి 'సూర్ దాస్ జీ ఇటు ఎవరైనా వెళ్ళారా?' అని అడిగారు మీరు వచ్చి 'సాధు మహరాజ్! ఇటు ఎవరైనా బాటసారి వచ్చి వెళ్ళాడా? అని అడిగారు.  "మహారాజా! ఒక వ్యక్తి యొక్క వాక్కు ద్వారా అతని పదవి, అతని ప్రతిష్ఠ ఏమిటో గుర్తించవచ్చు అని సమాధానమిచ్చాడు.