గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. మహాశివరాత్రి
Written By chj
Last Modified: సోమవారం, 7 మార్చి 2016 (20:21 IST)

కైలాసవాసుడు... దేవదేవుడు భక్తుల కోసం ద్వాదశ జ్యోతిర్లింగాల రూపంలో...

కైలాసంలో కొలువైన మహా శివుడు తన భక్తుల కోర్కెలు తీర్చేందుకు భూమిపై ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కొలువై ఉన్నాడని శైవపురాణం పేర్కొంటోంది. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శిస్తే కోరిన కోర్కెలు తీరడంతో పాటు జన్మ సార్థకత ఏర్పడుతుందనేది నమ్మకం.

ఆదిదేవుడు ఆ శంకరుడు. కైలాసంలో కొలువైన మహా శివుడు తన భక్తుల కోర్కెలు తీర్చేందుకు భూమిపై ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కొలువై ఉన్నాడని శైవపురాణం పేర్కొంటోంది. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శిస్తే కోరిన కోర్కెలు తీరడంతో పాటు జన్మ సార్థకత ఏర్పడుతుందనేది నమ్మకం. ఇంతటి మహత్యం కలిగిన ద్వాదశ జ్యోతిర్లింగాలు దేశం మొత్తంమీద 12 ప్రదేశాల్లో కొలువై ఉన్నాయి. ఈ ప్రదేశాల్లో కొలువైన ఆ పరమశివుడు భక్తుల ప్రార్ధనలు ఆలకించి వారికి ముక్తిని ప్రసాదిస్తాడని ప్రతీతి. 
 
ద్వాదశ జ్యోతిర్లింగాలు 
సౌరాష్ట్రలోని సోమనాథుడు, శ్రీశైలంలోని మల్లికార్జునుడు, ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడు, శివపురిలోని ఓంకారేశ్వరుడు వారణాసిలోని కాశీవిశ్వేశరుడు, దేవఘర్‌లోని వైద్యనాథుడు, కేదారనాథ్‌లోని కేదారేశ్వరుడు, ద్వారకలోని నాగేశ్వరుడు, ఔరంగాబాద్‌లోని ఘృష్ణేశ్వరుడు, నాసిక్‌లోని త్రయంబకేశ్వరుడు, రామేశ్వరంలోని రామేశ్వరుడు, మంచార్‌లోని భీమశంకరుడుల దేవాలయాలను ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలుగా పేర్కొంటారు. 
 
సౌరాష్ట్ర... సోమనాధ క్షేత్రం 
గుజరాత్‌కు ఆగ్నేయంగా అరేబియా సముద్ర తీరాన ఈ క్షేత్రం కొలువై ఉంది. సరస్వతీ నది సముద్రంలో కలిసే చోట ఈ ఆలయం నిర్మితమైంది. పురాణపరంగా ఈ దేవాలయాన్ని చంద్రదేవుడు సోమ నిర్మించాడని ప్రతీతి. ఆయన తర్వాత మరెందరో పురాణ పురుషులు ఈ దేవాలయాన్ని పునర్నిర్మించారు. అయితే ప్రస్తుతం ఉన్న ఆలయం 1950 ప్రాంతంలో నిర్మించబడింది. 
 
శ్రీశైలం... మల్లికార్జునుడి క్షేత్రం 
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోని కృష్ణానది తీరాన రేషబాగిరి కొండలపై కొలువైన ఈ క్షేత్రం దట్టమైన అడవుల్లో ఉంది. ఈ ఆలయాన్ని 1404లో హరిహరరాయులు నిర్మించారని ప్రతీతి. శ్రీశైలంలో మల్లికార్జునుడి సమేతంగా కొలువైన అమ్మవారి పేరు భ్రమరాంభికాదేవి. మహిషాసురుడిని సంహరించడం కోసం అమ్మవారు భ్రమరం రూపం దరించారని పురాణాలు పేర్కొంటున్నాయి. 
 
ఉజ్జయిని... మహాకాళేశ్వర క్షేత్రం 
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఓ సరస్సు ఒడ్డున మహాకాళేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఐదంతస్థులుగా నిర్మించబడిన ఈ దేవాలయంలో మొదటి అంతస్థు భూగర్భంలో ఉండడం విశేషం. ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడు దక్షిణామూర్తిగా ప్రసిద్ధిగాంచాడు. ఈ క్షేత్రంలో తాంత్రిక సాంప్రదాయం కన్పించడం మరో విశేషం. 
 
శివపురి... ఓంకారేశ్వర క్షేత్రం 
మధ్యప్రదేశ్‌లోని మాంధాత ద్వీపకల్పంలో నర్మదా, కావేరి నదుల సంగమ ప్రదేశంలో ఈ క్షేత్రం కొలువై ఉంది. శివాలయాలకు నెలవైన ఈ ద్వీపకల్పం సహజంగానే ఓంకార రూపంలో ఉండడం విశేషం. 
 
వారణాసి... కాశీవిశ్వేశర క్షేత్రం 
ఉత్తరప్రదేశ్‌లోని కాశీ పట్నంలో విశ్వేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఇండోర్ మహారాణి అహల్యాబాయ్ హోల్కర్ ఈ దేవాలయాన్ని నిర్మించారు. 
 
దేవఘర్... వైద్యనాథ క్షేత్రం 
జార్ఖండ్ రాష్ట్రంలోని దేవఘర్ చిన్నపట్నం. రావణుడు లంకకు తీసుకువెళ్లాలనుకున్న ఆత్మలింగాన్ని ఇక్కడ పెట్టి తిరిగి తీసుకువెళ్లలేక పోయాడన్నది పురాణ గాథ. 
 
కేదారనాథ్... కేదారేశ్వర క్షేత్రం 
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఈ క్షేత్రం హిమాలయాల్లో ఉంది. రుద్ర హిమాలయాల శ్రేణిలో ఉన్న ఈ దేవాలయంలోకి ఏడాదిలో ఆర్నెళ్లు మాత్రమే ప్రవేశం ఉంటుంది. 
 
ద్వారక... నాగేశ్వరుడి క్షేత్రం 
గుజరాత్ రాష్ట్రంలోని ద్వారక, బెట్‌ద్వారక ద్వీపకల్పాల మధ్య నాగేశ్వర్ క్షేత్రం కొలువై ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శించినవారు విషం నుంచి విముక్తి పొందుతారన్నది భక్తుల విశ్వాసం. 
 
ఔరంగాబాద్... ఘృష్ణేశ్వరుడి క్షేత్రం 
మహారాష్ట్రలోని ఘృష్ణేశ్వర్‌లో ఈ క్షేత్రం కొలువై ఉంది. తన భక్తురాల ఘృష్ణ కోరిక మేరకు శివుడు ఈ క్షేత్రంలో వెలిశాడని పురాణ గాథ. 
 
నాసిక్... త్రయంబకేశ్వరుడి క్షేత్రం 
మహారాష్ట్రలోని నాసిక్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం నెలవై ఉంది. ఈ దేవాలయంలోని మూడు లింగాలు త్రయంబకేశ్వర్‌కు అంకితమై కన్ను ఆకారంలో ఉండడంవల్ల ఈ క్షేత్రానికి త్రయంబకేశ్వరం అనే పేరు వచ్చింది. 
 
రామేశ్వరం... రామేశ్వరుడి క్షేత్రం 
తమిళనాడులోని రామేశ్వరంలో వెలసిన ఈ క్షేత్రాన్ని రామాయణ కాలం నాటిదిగా పేర్కొంటారు. 
 
మంచార్... భీమశంకరుడి క్షేత్రం 
మహారాష్ట్రలోని పూనే జిల్లాలో ఈ భీమ శంకర క్షేత్రం ఉంది. భీమా అనే నది ఇక్కడ ప్రవహిస్తుంది. ఇక్కడి దేవాలయంలో శివలింగం భూగర్భంలో ఉంటుంది. ఈ 12 జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శిస్తే జన్మ సార్థకం అవుతుందని శైవ భక్తుల విశ్వాసం.