శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (14:51 IST)

సీఎం పళనిస్వామి బల పరీక్షలో నెగ్గడం డౌటేనా? పన్నీర్ ఏం చేస్తారు? ఇంటికి రెసార్ట్ ఎమ్మెల్యేలు

తమిళ రాజకీయాలకు తెరపడేలా కనిపించట్లేదు. సీఎం పళని స్వామి బలపరీక్షలో నెగ్గుతారా? లేదా అనే దానిపై ప్రస్తుతం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పన్నీర్ సెల్వం తిరుగుబాటు బావుటా ఎగురవేసి తన మద్దతు దారులతో ద

తమిళ రాజకీయాలకు తెరపడేలా కనిపించట్లేదు. సీఎం పళని స్వామి బలపరీక్షలో నెగ్గుతారా? లేదా అనే దానిపై ప్రస్తుతం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పన్నీర్ సెల్వం తిరుగుబాటు బావుటా ఎగురవేసి తన మద్దతు దారులతో దూసుకుపోతున్నారు. సోషల్ మీడియాలో పన్నీరుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇంకా ఎమ్మెల్యేలను కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్నమ్మకు వ్యతిరేకంగా అమ్మ పార్టీకి విధేయుడిగా తన ధర్మయుద్ధం కొనసాగుతుందని ప్రకటించారు. 
 
ఈ నేపథ్యంలో 12రోజుల హైడ్రామాకు తెర దించుతూ ఎడప్పాటి పళనిస్వామి గురువారం తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ శనివారం బలం నిరూపించుకోవాల్సి ఉంది. కానీ అది సాధ్యమవుతుందా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఇన్నాళ్లు రిసార్ట్‌లో బందీలుగా ఉన్న ఎమ్మెల్యేలు ఇంటి ముఖం పడుతున్నారు. ఇదే అదనుగా తీసుకున్న పన్నీర్ సెల్వం వారిని తనవైపు లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా వారి నియోజకవర్గంలోని ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమయ్యేలా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఆ దిశగా పన్నీర్ వర్గం కార్యాచరణలోకి దిగింది. దాంతో ప్రజాభిప్రాయం పేరిట కొంత మంది శాసన సభ్యులు తమ వైపుకు వచ్చేలా ఓటింగ్ సమయంలో పళనికి ఓటేయకుండా నిరోధించేలా ఓపీఎస్ వర్గం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
 
అయితే ఇన్నాళ్లు తనవైపు తిప్పుకోలేని పన్నీర్ సెల్వం కేవలం బలపరీక్షకు కొన్ని గంటలే ఉన్న తరుణంలో రెసార్ట్ ఎమ్మెల్యేలను తనవైపు లాక్కుంటారా? లేదా అనేది కూడా చర్చనీయాంశమైంది. అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటేనే బలపరీక్షలో పన్నీరుకు మద్దతు లభిస్తుందని రాజకీయ పండితులు జోస్యం చెప్తున్నారు. శశివర్గంలో ఉన్నామని ఆలోచించకుండా.. ప్రజల వైపు ఉండాలనే విషయాన్ని ఎమ్మెల్యేలు గుర్తిస్తే తప్పకుండా పన్నీరుకే మద్దతు లభించే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. 
 
ఇకపోతే.. పన్నీర్ సెల్వమే ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుతూ అన్నాడీఎంకేకు చెందిన ఓ కార్యకర్త సెల్ టవర్‌ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దిండుక్కల్‌ జిల్లాకు చెందిన అన్నాడీఎంకే కార్యకర్త సుందరమూర్తి పట్టివీరన్‌పట్టి బస్టాండ్ సమీపంలో ఓ సెల్‌ఫోన్‌ టవర్‌ ఎక్కి పన్నీర్‌కు మద్దతుగా నినాదాలు చేశాడు. పన్నీర్‌ మళ్లీ ముఖ్యమంత్రిగా కొనసాగాలని డిమాండ్‌ చేశాడు. అందుకు భిన్నంగా జరిగితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అతను కిందకు దిగేలా చేశారు. అనంతరం అతడిని అరెస్ట్ చేశారు.
 
ఇదిలా ఉంటే.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను కర్ణాటక నుంచి తమిళనాడులోని జైలుకు తరలించాలని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై ఆయన గురువారం సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో పేర్కొన్నారు. భద్రత కారణాల దృష్ట్యా శశికళను తమిళనాడు కారాగారానికి మార్చాలన్నారు. దీనికి సంబంధించి శశికళ తరఫున న్యాయవాదులు రెండు రోజుల్లో సుప్రీం కోర్టును ఆశ్రయించాలని సూచన కూడా చేశారు.