గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 20 మార్చి 2017 (01:14 IST)

పాటలు పాడితే తరతరాల వరకు అల్లా ఆగ్రహానికి గురి కావలసిందేనా?

సోనీ రియాలిటీ మ్యూజిక్‌ షోలో తనని తను పరిచయం చేసుకుంటూ... స్వరాల యువరాణి కావాలన్న ఆశను ప్రకటించిన ఈ ముస్లిం బాలిక నహీద్‌ అఫ్రీన్‌ గొంతును అల్లా పేరు చెప్పి ఇప్పుడు నొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆమెకు సపోర్ట్ చేయాలా వద్దా.. ముస్లిం మతవాదుల దృష్టిల

‘‘అనగనగా ఒక యువరాణి. ఆమె పేరు రాపుంజల్‌. పెద్ద జుట్టుతో భలే అందంగా ఉండేది. అందరినీ ఆకట్టుకునేది. ఇతర రాజ్యాల యువరాణులు ఆమె జుట్టు రహస్యం తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించేవారు. కానీ ఆ రహస్యాన్ని రాపుంజల్‌ ఎప్పుడూ బయట పెట్టలేదు. ఆ రహస్యం రహస్యంగానే ఉండిపోయింది. నాదీ పెద్ద జుట్టే. నాకూ యువరాణి కావాలని ఆశ. స్వరాల యువరాణి కావాలి. ఏ సంగీత పోటీలకు వెళ్లినా జడ్జీలతో సహా అంతా అందమైన నా పొడవాటి జుట్టును ప్రశంసించేవాళ్లే. నా పేరు నహీద్‌ అఫ్రీన్‌. ఈ దేశపు రాపుంజల్‌ని! సంగీతం అంటే ప్రాణం. యాక్టింగ్, డ్రాయింగ్, టేబుల్‌ టెన్నిస్‌... అన్నిటికన్నా అల్లరి చేయడం అంటే చాలా ఇష్టం ’

 
సోనీ రియాలిటీ మ్యూజిక్‌ షోలో తనని తను పరిచయం చేసుకుంటూ... స్వరాల యువరాణి కావాలన్న ఆశను ప్రకటించిన ఈ ముస్లిం బాలిక నహీద్‌ అఫ్రీన్‌ గొంతును అల్లా పేరు చెప్పి ఇప్పుడు నొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆమెకు సపోర్ట్ చేయాలా వద్దా.. ముస్లిం మతవాదుల దృష్టిలో కవాలీ పాటలు మాత్రమే పాటలా.. ?
 
‘అకీరా’ చిత్రంలో ‘రజ్‌రజ్‌కే’ అనే పాట ఉంది. ఆ పాట ‘దర్ద్‌ బేదర్‌దా... దర్ద్‌ బేదర్‌దా’ అనే చరణంతో మొదలౌతుంది. దర్ద్‌ బేదర్‌దా అంటే... దయలేని బాధ. ఆ పాట పాడింది ఈ నహీద్ అప్రీనే. ఒకే ఒక్క పాటతో అస్సాంలోని ఆమె పుట్టిన ప్రాంతంలోని ప్రజలంతా చివరకు ముఖ్యమంత్రితో సహా ఫిదా అయిపోయారు. 
 
ఆ పాట అర్థం ఇలా ఉంటుంది.
 
జీవితమా... నవ్వూ నేనూ ఘర్షణ పడుతున్నాం
రాజీకొచ్చే సూచనలేమీ నాకు కనిపించడం లేదు.
ఇప్పుడు ఇద్దరిలో ఒకరమే ప్రాణాలతో ఉంటాం.
కటువుగా ఉండేదే కటుత్వం పనికిరాదని అంటోంది!
ఎంత ఏడిపిస్తావో ఏడిపించు నన్నివాళ.
ఎంత శిక్షిస్తావో శిక్షించు నన్ను ఇవాళ.
బాధను భరించడానికి నా హృదయం సిద్ధమైంది.
నా దారిలో పగిలిన గాజుముక్కలు పడి ఉన్నాయి.
అవి నన్ను తీవ్రంగా గాయపరుస్తున్నాయి.
ఆ బాధే నాకిప్పుడు ఉపశమన లేపనం...
 
సినిమాలో... సమాజానికీ, ఆ అమాయకపు పల్లె పిల్లకు మధ్య జరిగిన ఘర్షణ ఇది. నిజ జీవితంలో ఈ పాట పాడింది ఎవరో కాదు...  నహీద్‌ అఫ్రీనే! ప్రస్తుతం అఫ్రీన్‌ ఉన్న పరిస్థితికి, ఆ పాటలోని భావం చక్కగా సరిపోతుంది.

సోనీ రియాలిటీ మ్యూజిక్‌ షోలో తనని తను పరిచయం; చేసుకుని తన ఫేవరైట్ అయిన బెంగాలీ సింగర్ యాక్ కింగ్ పాట పాడింది అప్రిన్. పాట పూర్తవగానే  సల్మాన్‌ ఖాన్‌ ఎగ్జయిట్‌ అయిపోయాడు. రియాలిటీ షో జడ్జీలలో ఒకరు ఆయన. ‘‘శభాష్‌ నహీద్‌. ఈ పాటతో ఈ రోజు  నువ్వు మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లావు. శభాష్‌’’ అన్నాడు. ఇంకో పాటకు ఇంకో జడ్జి ‘‘నువ్వు స్వరాల ఖజానా. ఎక్స్‌ప్రెషన్స్‌ ఖజానా. పెర్ఫార్మెన్స్‌ ఖజానా... ఎన్నని చెప్పమంటావు? నువ్వే ఒక ఖజానా! మంచి భవిష్యత్తు ఉంది నీకు. ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు. 
 
కానీ ముస్లిం మతవాదులు, ముల్లాలు మరోలా భావిస్తున్నారు. ఈ నెల 25న అస్సాంలోని ఉడాలి సొనాయి బీబీ కాలేజీలో అఫ్రీన్‌ మ్యూజికల్‌ నైట్‌ ఉంది. అయితే అలాంటి ఆలోచనలేవీ పెట్టుకోవద్దని అస్సాంలోని 46 మంది ముల్లాలు ఏకమై అఫ్రీన్‌కు ఫత్వా జారీ చేశారు. మధ్య అస్సాంలోని హోజాయ్, నగావన్‌ జిల్లాల్లో ఈ ఫత్వా ఉన్న కరపత్రాలు పంపిణీ అయ్యాయి. ‘చుట్టూ మసీదులు, ఈద్గాలు, మదరసాలు, ముస్లింల సమాధులు ఉన్న ప్రాంతంలో మ్యూజికల్‌ నైట్‌ పేరుతో పాటలు పాడితే తరతరాల వరకు అల్లా ఆగ్రహానికి గురి కావలసి ఉంటుంది’ అని ముల్లాలు ఆ కరపత్రాల్లో హెచ్చరించారు. 
 
అఫ్రీన్‌ చిగురుటాకులా వణికిపోయింది. పాటంటే ఆ అమ్మాయికి ప్రాణం. వణికింది ఆ ప్రాణమే. 2015 సోనీ టీవీ మ్యూజికల్‌ రియాలిటీ షోలో అఫ్రీన్‌ ఫస్ట్‌ రన్నర్‌–అప్‌. వైష్ణవ ఆచార్యులు శ్రీమంత శంకరదేవ విరచించి, స్వరపరచిన కీర్తనలు అఫ్రీన్‌ గాత్రంలోంచి ఒలికి ఆమెకు ఒక దేవరాగపుత్రికగా పునర్జన్మనిచ్చాయి. ఈ జన్మను నిలుపుకోడానికి ఇప్పుడు ఫత్వాలతో పోరాటానికి దిగింది అఫ్రీన్‌!
 
‘మ్యూజిక్, డాన్స్, డ్రామా, థియేటర్‌... ఇవన్నీ షరియా చట్టాలకు వ్యతిరేకం. అల్లా క్షమించడు’ అని కరపత్రాల్లోని ముల్లాల హెచ్చరికను చూడగానే మొదట ఆఫ్రీన్‌ ఏడ్చేసింది. తర్వాత తేరుకుంది. ‘స్వరం నాకు దేవుడిచ్చిన వరం. ఆ వరాన్ని నేను వదులుకోలేను’ అంటోంది. అఫ్రీన్‌ తండ్రి కూడా కూతురికి పూర్తి మద్ధతు ఇస్తున్నారు. స్థానిక మత పెద్దలు, ముస్లిం ప్రముఖులతో పాటు విద్యార్థి సంఘాలు కూడా అఫ్రీన్‌ వైపే ఉన్నాయి.
 
అఫ్రీన్‌ అస్సామీ. తేజ్‌పూర్‌లోని బిస్వనాథ్‌ చరియాలీ ఆమె ఊరు. టెన్త్‌ చదువుతోంది. అస్సామీ, హిందీ, బెంగాలీ భాషల్లో పాడుతుంది. మ్యూజిక్‌ షోలో ఫస్ట్‌ రన్నర్‌ అప్‌గా గెలిచాక, అఫ్రీన్‌కు సినిమా చాన్స్‌ వచ్చింది. ఇంట్లో పెద్దమ్మాయి. తమ్ముడు ఫయీజ్‌ అన్వర్‌. సినిమాలో పాడినప్పటి నుంచి అక్కను వాడు అబ్బురంగా చూస్తున్నాడు! ‘అక్కా.. స్కూల్లో అంతా నీ గురించే గొప్పగా చెప్పుకుంటున్నారు’ అని ఇంటికి వచ్చీరాగానే ఉత్సాహంగా చెబుతున్నాడు. మునుపటిలా కాదు. అక్క చెప్పిన పనుల్నీ, చెప్పని పనుల్నీ చటుక్కున అందుకుని చేసేస్తున్నాడు. ఇక చరియాలీ గ్రామస్థులైతే ‘మా ఊరి కోకిలమ్మ’ అంటూ మురిసిపోతున్నారు.
 
సాక్షాత్తూ ముఖ్యమంత్రే తను అఫ్రీన్‌ అభిమానిని అని చెప్పుకుంటే ఏ తండ్రికి మాత్రం గొప్పగా ఉండదు! అయితే ఇప్పుడా ఉత్సాహం స్థానంలో ఆ కుటుంబంలో భయం, ఆందోళన వచ్చి చేరాయి. అఫ్రీన్‌కి వ్యతిరేకంగా జారీ అయిన ఫత్వాలోని అర్థం ఒకటే. ‘ఆ పిల్ల పాడడం ఆపకుంటే... ఆ ఇంటిని వెలి వెయ్యండి’ అని చెప్పడం. ముస్లిం సంప్రదాయ కుటుంబాలకు సహజంగానే ముల్లాలు చెప్పిందే వేదం అవుతుంది. 
 
అయితే అస్సాంలోని ముస్లిం కుటుంబాలకు ఆఫ్రీన్‌ గాత్రం కూడా వేదంలానే వినిపిస్తోంది. అఫ్రీన్‌ అభిమాని అయిన పూర్వపు ముఖ్యమంత్రి తరుణ్‌ గొగోయ్, ప్రస్తుత ముఖ్యమంత్రి శరవానంద్‌ సోనోవాల్‌ పూర్తిగా అఫ్రీన్‌ వైపే ఉన్నారు. ఈ చిన్నారికి కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని స్థానిక యంత్రాంగానికి సి.ఎం. ఆఫీస్‌ నుంచి ఆదేశాలు వెళ్లాయి. అంతేకాదు, సోనోవాల్‌ స్వయంగా అఫ్రీన్‌కి ఫోన్‌ చేసి మరీ ధైర్యం చెప్పారు!
 
అఫ్రీన్‌ ఇటీవల పాడిన పాటల్లో కొన్ని తీవ్రవాదాన్ని వ్యతిరేకించేవి కూడా ఉన్నాయి. ‘‘బహుశా ముల్లాల ఆగ్రహానికి అదే కారణం కావచ్చు’ అని భావిస్తున్న పోలీసులు ఆ కోణంలోంచి కూడా విచారణ జరుపుతున్నారు. 
 
ఇదే నిజమైతే.. దేశం మొత్తం ఇప్పుడు ఈ చిన్నారి ముస్లిం బాలిక వైపు తిరగాల్సిందే. దయలేని బాధ గురించి పాడుతున్న ఆమె పాటను వినాల్సిందే. పాటలు పాడటం మత వ్యతిరేకం అంటున్న ఆ ఛాందసవాదులు ఏ మతంలో ఉన్నా సరే అలాంటి వారిని ఈ లౌకిక ప్రపంచం నుంచి బహిష్కరించాల్సిందే...