శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 3 మార్చి 2017 (15:31 IST)

డోనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో ఎన్నారై యూత్‌కు దూరమవుతున్న పెళ్లి యోగం

బాబ్బాబూ... మా అబ్బాయికి ఎక్కడైనా అమ్మాయి ఉంటే ఆచూకీ చెస్తావా? ఇది ఎన్నారై యువకుల తల్లిదండ్రుల పరిస్థితి. పెళ్లీడుకొచ్చిన పిల్లలకు వివాహం చేయలేక సతమతమవుతున్నారు. ఈ పరిస్థితి చాలా మంది ఎన్నారై తల్లిదండ

బాబ్బాబూ... మా అబ్బాయికి ఎక్కడైనా అమ్మాయి ఉంటే ఆచూకీ చెస్తావా? ఇది ఎన్నారై యువకుల తల్లిదండ్రుల పరిస్థితి. పెళ్లీడుకొచ్చిన పిల్లలకు వివాహం చేయలేక సతమతమవుతున్నారు. ఈ పరిస్థితి చాలా మంది ఎన్నారై తల్లిదండ్రుల్లో ఉండటంతో ఎన్నారై యువకులకు పెళ్లి యోగం లేదనే భావన ఏర్పడింది. 
 
నిజానికి గతంలో ఎన్నారైలకు ఉన్న డిమాండ్ అంతాఇంతా కాదు. అమ్మాయిల తల్లిదండ్రులు ఎన్నారై అల్లుళ్ల కోసం తెగ వెతికేవారు. రూ.లక్షలకు లక్షలు కట్నాలు పోసి, ఎన్నారైలను అల్లుళ్లుగా చేసుకునేవారు. అల్లుడు ఎన్నారై అయితే ఇక్కడున్న అత్తామామలకు సమాజంలో ఎంతో గౌరవం లభించేది.
 
కానీ, అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టాక పరిస్థితి అంతా ఒక్కసారి తారుమారైంది. హెచ్-1బీ వీసాలపై ఆంక్షలు, కఠినతరమవుతున్న ఇమిగ్రేషన్ చట్టాలు, జడలు విప్పుతున్న జాత్యహంకారం, భారతీయులపై జరుగుతున్న భౌతిక దాడులు... తెలుగు రాష్ట్రాల్లోని అమ్మాయిల తల్లిదండ్రులకు వణుకు పుట్టిస్తున్నాయి. 
 
ట్రంప్ నిర్ణయాలతో భారత టెక్కీల ఉద్యోగాలు కూడా ప్రమాదంలో పడ్డాయి. ఎన్నారైల ఉద్యోగాలకు భద్రత లేకపోవడం, వారిపై ఎప్పుడు, ఎవరు దాడి చేస్తారో అన్న భయం అమ్మాయిల తల్లిదండ్రుల్లో నెలకొంది. దీంతో ఎన్నారై యువకుడి కంటే స్వదేశంలో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్న యువకుల వైపే అమ్మాయిల తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో, ఎన్నారై యువకులకు వివాహం కావడం ప్రస్తుత పరిస్థితుల్లో అంత ఈజీ కాదనే విషయం అర్థమవుతోంది. ఓడలు బండ్లు కావడం అంటే ఇదేనేమో.!