శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రాంతాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 5 డిశెంబరు 2014 (17:19 IST)

పాండవుల గుట్టలు: ఇక్కడే పంచపాండవులు దలదాచుకున్నారట!

పాండవులు అరణ్యవాస సమయంలో ఎన్నో ప్రాంతాల మీదుగా తమ ప్రయాణాన్ని కొనసాగించారు. అలా పాండవులు తల దాచుకున్నట్టుగా చెప్పబడుతోన్న ప్రదేశాల్లో ఒకటి వరంగల్ జిల్లా రేగొండ మండలం పరిధిలో గల రావులపల్లి గ్రామ శివారులో కనిపిస్తుంది. ఇక్కడి గుట్టలను 'పాండవుల గుట్టలు' గా పిలుస్తుంటారు. 
 
అరణ్యవాస కాలంలో పాండవులు కొంతకాలం పాటు ఇక్కడ ఉన్నట్టు చెబుతుంటారు. అందుకు నిదర్శనంగా ఇక్కడ ఎన్నో ఆనవాళ్లు కనిపిస్తుంటాయి.
 
'కుంతీదేవి' ఆలయం, భీముడు నిర్మించినట్టుగా చెప్పబడుతోన్న కొన్నిశిధిల నిర్మాణాలు,  ధర్మరాజువిగా చెప్పబడుతోన్న పాదాలు ఇక్కడ కనిపిస్తాయి. ఈ గుట్టపై ప్రత్యేకతను సంతరించుకున్నట్టుగా ఒక బండరాయి దర్శనమిస్తుంది. పాండవులు, ద్రౌపతి ఈ బండరాయిపై కూర్చుని కాలక్షేపం చేసేవాళ్లట. అందువలన దీనిని 'కచేరి బండ' గా పిలుస్తుంటారు.
 
ఈ గుట్టపై పాండవులు ఏర్పాటు చేసుకున్నదిగా ఒక నీటి 'చెలమ' కనిపిస్తుంది. ఇందులో నీరు ఎండిపోవడమంటూ ఇంతవరకూ జరగలేదట. ఇక 'ఘటోత్కచుడు' స్నానం చేసినట్టుగా చెప్పబడుతోన్న ఒక బండరాయి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. 
 
చూడటానికి ఈ బండరాయి తడి తడిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ బండరాయిపై కూర్చుంటే ఆ తడి అంటుకోదు. ఇలా ఎంతో మహిమాన్వితమైనదిగా ఈ పాండవుల గుట్ట కనిపిస్తుంది. ఈ గుట్టపై అడుగుపెడితే అది పుష్పక విమానంలా మారి పాండవుల కాలానికి తీసుకువెళ్లిన అనుభూతి లభిస్తుంది.