గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. శ్రీకృష్ణాష్టమి
Written By ivr
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2016 (11:38 IST)

శ్రీకృష్ణుడు ముందు ప్రత్యక్షమైన పార్వతీపరమేశ్వరులు... జన్మాష్టమి నేడే

శ్రీ కృష్ణ భగవానుడు ఓ ఉత్తమ మంత్రాన్ని జపించి తనకు కావలసిన వరాలను పొందినట్లు శివపురాణం చెబుతోంది. పూర్వం శ్రీ కృష్ణ భగవానుడు తనకు కావలసిన కోరికలను సిద్ధింపజేసుకోవడం కోసం ముక్కంటిని తలచి తపస్సు చేయాలను

శ్రీ కృష్ణ భగవానుడు ఓ ఉత్తమ మంత్రాన్ని జపించి తనకు కావలసిన వరాలను పొందినట్లు శివపురాణం చెబుతోంది. పూర్వం శ్రీ కృష్ణ భగవానుడు తనకు కావలసిన కోరికలను సిద్ధింపజేసుకోవడం కోసం ముక్కంటిని తలచి తపస్సు చేయాలనుకున్నాడు. వెంటనే హిమాలయ పర్వత ప్రాంతంలో ఉన్న పరమశివభక్తుడైన ఉపమన్యు మహర్షి దగ్గరకు వెళ్ళి తన మనస్సులోని మాటను చెప్పాడు. 
ఫోటో క్రెడిట్-ఇషా
అప్పుడు ఆ మహర్షి అధర్వ వేద ఉపనిషత్తులోని "నమశ్శివాయ" అనే పంచాక్షర మంత్రాన్ని ఉపదేశించి, 16నెలల పాటు ఆ మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేయమన్నాడు. ఇలా నమశ్శివాయ మంత్రముతో 16 నెలల పాటు తపస్సు చేసి పార్వతీ పరమేశ్వరులను కృష్ణుడు ప్రత్యక్షం చేసుకున్నాడు. శ్రీ కృష్ణ తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ఏం వరాలు కావాలో? కోరమంటాడు.
 
అప్పుడు కృష్ణుడు తను 8 వరాలను కోరుకుంటానని చెప్పి వాటిని శివుడి ముందుంచాడు. అచంచలమైన గొప్పకీర్తి, స్థిరమైన శివసన్నిధి లభించాలి. నిత్యం శివధర్మంలో బుద్ధి నిలవాలి. నిత్యం తాను శివభక్తితో ఉండాలి. శత్రువులంతా సంగ్రామంలో నశించాలి. ఎక్కడా శత్రువుల వల్ల తనకు అవమానం కలుగకూడదు. 
 
తనకు తొలిగా జన్మించిన కుమారులకు ఒక్కొక్కరికి పదిమంది పుత్రులు కలగాలి. యోగులందరికీ తాను ప్రియుడు కావాలి. ఈ వరాలను తనకిమ్మని కృష్ణుడు కోరగానే ముక్కంటి వాటినన్నింటిని అనుగ్రహిస్తాడు. ఇదేవిధంగా శ్రీ కృష్ణ పరమాత్మ చేసిన తపస్సుకు పార్వతీదేవి సంతసించి కావలసినన్ని వరాలను కోరమని అడుగుతుంది. అప్పుడు కృష్ణుడు.. బ్రాహ్మణుల మీద ఎప్పటికీ ప్రజలకు ద్వేషం కలగకూడదు. తన తల్లిదండ్రులు సర్వకాలాలలోను సంతోషంగా ఉండాలి. 
 
తానెక్కడ ఉన్నా సర్వ ప్రాణుల మీద తనకు అనురాగం కలగాలి. మంగళకరమైన బ్రాహ్మణ పూజను తాను సర్వదా చేస్తుండాలి. తాను వంద యజ్ఞాలను చేసి ఇంద్రుడు లాంటి దేవతలను సంతోష పెట్టాలి. తన గృహంలో ఎల్లప్పుడూ వేల సంఖ్యలో యతులకు, అతిథులకు శ్రద్ధతో పవిత్రమైన భోజనాన్ని సమర్పించే అవకాశం కలగాలి. అలాగే తాను వేలసంఖ్యలో భార్యలకు ప్రియమైన భర్త కావాలి. తనకు వారంటే ఎప్పటికీ అనురాగం ఉండాలి. 
 
వారి తల్లిదండ్రులంతా లోకంలో సత్య వాక్యాలను పలుకుతూనే ఉండాలి. అనే వరాలను కృష్ణుడు శక్తిమాతను అడిగాడు. వాటిని శ్రీ కృష్ణుడికి వెంటనే అనుగ్రహించి ఆ మరుక్షణంలోనే పార్వతీ పరమేశ్వరులిద్దరు అంతర్ధానమయ్యారని శివపురాణం చెబుతోంది. "నమశ్శివాయ" మంత్రంచే కృష్ణుడు సిద్ధింప చేసుకున్న వరాలలో కొన్ని మాత్రమే ఆయనకు సంబంధించినవి. మిగతా వరాలను పరిశీలిస్తే సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కోరుకున్నవే అవుతాయి. 
 
అందుచేత శ్రీ కృష్ణ భగవానుడు కొంతవరకు తమ స్వార్థాన్ని ఆకాంక్షిస్తూ వరాలు కోరినా.. ఎంతో కొంత సామాజిక శ్రేయస్సును కూడా అభిలాషించాలన్న ఓ ఉత్తమ ప్రబోధం ఈ కథలో కనిపిస్తుంది. లోకకళ్యాణార్థం భూమిపై అవతరించిన శ్రీ కృష్ణ భగవానుడిని శ్రీ కృష్ణాష్టమి రోజున నిష్టతో పూజించి ఆయన ఆశీస్సులు పొందుదాం..