శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 31 జులై 2014 (18:39 IST)

సినిమా వాళ్లు వైజాగ్‌ వచ్చేయండి... కంభంపాటి పిలుపు

నటుడు సాయికుమార్‌ అంటే ప్రత్యేకమైన అభిమానముంది. ఆయన మా బిజెపి పార్టీ తరఫున పోటీ చేశారు. అప్పటినుంచి ఆయనతో మంచి సంబంధాలున్నాయి అని వైజాగ్‌ ఎంపి  కంభంపాటి హరిబాబు అంటున్నారు. సాయికుమార్‌ కొడుకు ఆది హీరోగా 'గాలిపటం' రూపొందుతోంది. ఈ చిత్రం ప్లాటినం డిస్కు ఫంక్షనులో ఆయన పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ''ఇంతవరకు వైజాగ్‌లో షూటింగ్‌ గానీ, ఫంక్షన్‌ గానీ జరుపుకున్న ప్రతి చిత్రం సూపర్‌హిట్‌ అనే సెంటిమెంట్‌ బలంగా వుందని, ఆ సెంటిమెంట్‌ను 'గాలిపటం' కూడా నిజం చేసి మరింత బలం చేకూర్చగలదని నమ్ముతున్నానని అన్నారు. 
 
నటుడు సాయికుమార్‌ నాకు మంచి మిత్రుడు. ఆయన మా బిజెపి పార్టీ తరఫున ఇంతకుముందు కర్నాటక అసెంబ్లీకి పోటీ చేశారని, అప్పటి నుండి ఆయనతో నాకు చక్కని స్నేహం ఉంది. వారి అబ్బాయి ఆది మంచి హీరోగా నిలదొక్కుకున్నందుకు చాలా ఆనందంగా వుంది. 'గాలిపటం' ఆడియో లాగే సినిమా కూడా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 
 
ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా చిత్ర ప్రముఖులందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. మీరంతా విశాఖ వచ్చేయండి. ఇక్కడ మీకు అన్ని వసతులు కల్పిస్తాం. సహజసిద్ధమైన అందాల సుందర ప్రదేశాలు, అన్నిరకాల లొకేషన్లు ఇక్కడ ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుని విశాఖను నవ్యాంధ్రప్రదేశ్‌కు సినీ రాజధానిగా మార్చుకుందాం'' అన్నారు.
 
'రచ్చ' సెంటిమెంట్‌ వర్కవుట్‌ అవుతుంది... సంపత్‌ నంది 
 
నాకు మొదటి నుండి  వైజాగ్‌ అన్నా, వైజాగ్‌ ఏరియా ప్రజలన్నా ఎనలేని అభిమానం. వైజాగ్‌ అంటే గొప్ప సెంటిమెంట్‌. నా మొదటి చిత్రం 'ఏమైంది ఈవేళ' ఇక్కడ 50 రోజులు ఆడింది. రెండో చిత్రం 'రచ్చ' 100 రోజులు ఆడింది. మిగతా ఏరియాల్లో కంటే వైజాగ్‌ ఏరియాలో 'రచ్చ'పెద్ద హిట్‌. అందుకే 'గాలిపటం' ప్లాటినం డిస్క్‌ ఇక్కడే చేయాలని నిర్ణయించాం. ముందుగా ఆర్‌కె బీచ్‌లో పబ్లిక్‌ ఫంక్షన్‌గా నిర్వహించాలని ప్లాన్‌ చేశాం. కానీ వర్షం కారణంగా ఇండోర్‌ స్టేడియంలో చేయాల్సి వచ్చింది. ఇంత బిజీ షెడ్యూల్‌లో కూడా మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు, ఎంపీ కంభంపాటి హరిబాబు, కె.రవీందర్‌బాబు, ఎమ్మెల్యే ఆర్‌ఎల్‌ఎన్‌ రాజు గార్లకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 
 
మేము ఎంతో కష్టపడి సమిష్టిగా ఈ చిత్రాన్ని నిర్మించాము. నూటికి నూరు శాతం ఎక్కడా రాజీపడకుండా మేము అనుకున్నది అనుకున్నట్లు పూర్తి చేశాము. చాలా సంతృప్తికరంగా వచ్చింది. ఆడియో సూపర్‌హిట్‌ కావడంతో మా నమ్మకం రెట్టింపు అయింది. 'గాలిపటం' గ్యారంటీగా సూపర్‌హిట్‌ అవుతుంది. ఇదే విషయాన్ని రేపు మీరు చెబుతారు. ఆగస్టు 8వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. మీ ఆశీర్వాదం కోసం ఎదురుచూస్తున్నాం అని నిర్మాత, దర్శకుడు సంపత్‌నంది  అన్నారు.