శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 20 అక్టోబరు 2017 (17:36 IST)

"మెర్సల్‌"పై బీజేపీ నేతల మండిపాటు.. జీఎస్టీపై డైలాగ్‌ వద్దట.. విజయ్ రాజకీయాల్లోకి వస్తారా?

కోలీవుడ్ హీరో విజయ్ తాజా సినిమా మెర్సల్ (తెలుగులో అదిరింది) వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. హిట్ టాక్ సొంతం చేసుకుంది. తమిళనాడు సినీ చరిత్రలో రికార్డులను తిరగరాసిన మెర్సల్.. ఓవర్సీస్‌లో రయీస్, దంగల్ రికార

కోలీవుడ్ హీరో విజయ్ తాజా సినిమా మెర్సల్ (తెలుగులో అదిరింది) వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. హిట్ టాక్ సొంతం చేసుకుంది. తమిళనాడు సినీ చరిత్రలో రికార్డులను తిరగరాసిన మెర్సల్.. ఓవర్సీస్‌లో రయీస్, దంగల్ రికార్డులను కూడా బద్ధలు కొట్టింది. అయితే ఈ సినిమాలోని డైలాగులను బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు.

ఏడు శాతం జీఎస్టీ అమ‌ల్లో ఉన్న సింగ‌పూర్‌లో ప్ర‌జ‌ల‌కు ఉచిత వైద్య‌స‌హాయం అందుతుంద‌ని, అదే 28 శాతం జీఎస్‌టీ వసూలు చేస్తున్న మనదేశంలో ఉచితంగా వైద్య సేవలు ఎందుకు అందించట్లేదని విజయ్ ఓ సన్నివేశంలో ప్రశ్నిస్తాడు. ఈ ప్రశ్నే ప్రస్తుతం వివాదాస్పదమైంది. 
 
ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ విధానాల‌ను మెర్సల్ కించ‌ప‌రుస్తోంద‌ని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా విడుద‌లైన `మెర్స‌ల్‌` చిత్రంలో మోదీ ప్ర‌వేశ‌పెట్టిన‌ వ‌స్తు సేవ‌ల ప‌న్ను, డిజిట‌ల్ ఇండియా ప్ర‌చారాల‌ను త‌ప్పుగా చూపించిన‌ట్లుగా వుందని త‌మిళ‌నాడు రాష్ట్ర బీజేపీ నాయ‌కుడు టీఎన్ సుంద‌ర‌రాజ‌న్ పేర్కొన్నారు.

అలాంటి స‌న్నివేశాల‌ను తొల‌గించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. అలాగే ''మెర్స‌ల్'' చిత్రంలో భార‌త్‌, సింగ‌పూర్ దేశాల‌ను పోల్చుతూ విజ‌య్ పాత్ర చెప్పిన డైలాగులు త‌ప్పుడుత‌డ‌క‌లుగా ఉన్నాయ‌ని బీజేపీ యూత్ వింగ్ నేత ఎస్‌జీ సూర్య ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.
 
మెర్సల్ సినిమాపై బీజేపీ నేతలు మండిపడుతున్నా.. ఈ చిత్రానికి కలెక్షన్లు పెరిగిపోతున్నాయి. గతంలో దివంగత ముఖ్యమంత్రి, సినీ నటుడు, అన్నాడీఎంకే అగ్రనేత ఎంజీఆర్ కూడా తమిళ పద్ధతులకు పెద్ద పీట వేస్తూ సినిమాను రిలీజ్ చేసి.. గొప్ప ప్రజానాయకుడిగా ఎదిగారు.

అదే తరహాలో మెర్సల్ సినిమా ద్వారా విజయ్ కూడా తమిళ సంప్రదాయాలకు అద్దం పడుతూ సినిమా చేయడం.. అతని రాజకీయ అరంగేట్రానికి లైన్ క్లియర్ చేసేందుకేనని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. మెర్సల్ చిత్రంలో జల్లికట్టు ప్రాధాన్యతను ఎత్తి చూపడం ఇందుకు నిదర్శనమని.. తప్పకుండా విజయ్ రాజకీయాల్లోకి వస్తారని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.