గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : సోమవారం, 2 ఏప్రియల్ 2018 (10:40 IST)

కావేరి చిచ్చు : అట్టుడుకుతున్న తమిళనాడు.. 5న రాష్ట్ర బంద్

తమిళనాడులో కావేరి చిచ్చురాజుకుంది. కావేరీ జలాల పంపిణీ కోసం కావేరీ జల మండలిని ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు బేఖాతర్ చేసింది.

తమిళనాడులో కావేరి చిచ్చురాజుకుంది. కావేరీ జలాల పంపిణీ కోసం కావేరీ జల మండలిని ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు బేఖాతర్ చేసింది. పైగా, కావేరీ బోర్డు ఏర్పాటులో మరింత స్పష్టత కావాలంటూ కేంద్రం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయడం గమనార్హం. 
 
ఇది తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలకు ఆగ్రహం తెప్పించింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు కావేరి జల మండలిని ఏర్పాటు చేయని కేంద్ర ప్రభుత్వ వైఖరిని అధికార పార్టీతో పాటు.. అన్ని విపక్ష పార్టీలు ఎండగడుతున్నాయి. ఈ ఆందోళన భాగంగా, ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో 5న రాష్ట్ర బంద్‌ నిర్వహించాలని నిర్ణయించారు. 
 
ఈ సమావేశం అనంతరం డీఎంకే నేత ఎంకే స్టాలిన్‌, టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఎస్‌.తిరునావుక్కరసర్‌, సీపీఐ, సీపీఎం నేతలు ముత్తరసన్‌, బాలకృష్ణన్‌, డీకే నాయకుడు కె. వీరమణి, డీపీఐ నాయకుడు తొల్‌ తిరుమావళవన్‌, ఆయా పార్టీలకు చెందిన వేలాదిమంది కార్యకర్తలు చెన్నై వళ్లువర్‌కోట్టమ్‌ వద్ద ఆకస్మికంగా రాస్తారోకో నిర్వహించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. 
 
మరోవైపు, అన్నాడీఎంకేకు రాజ్యసభ సభ్యుడు ముత్తుకరుప్పన్ తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. కావేరీ జల మండలిని ఏర్పాటు చేయనందుకు నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఇది అధికార పార్టీకి చెందిన ఎంపీలపై మరింత ఒత్తిడి పెంచినట్టయింది.