బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , శనివారం, 25 మార్చి 2017 (06:11 IST)

ఇల్లూ.. ఉద్యోగం.. మహిళలు రెండు యుద్ధాలు చేయాల్సిందేనా?

నేటి కాలంలో భార్య, భర్త ఇద్దరూ ఉద్యోగం చేయక తప్పని పరిస్థితుల్లో మహిళలు జీవితంలో యుద్ధమే చేయాల్సి వస్తోంది. కొన్నిసార్లు ఉద్యోగంలో ఉండే లక్ష్యాలతో ఇంటిని నిర్లక్ష్యం చేయొచ్చు. తాజాగా నిర్వహించిన ఓ సర్

నేటి కాలంలో భార్య, భర్త ఇద్దరూ ఉద్యోగం చేయక తప్పని పరిస్థితుల్లో మహిళలు జీవితంలో యుద్ధమే చేయాల్సి వస్తోంది. కొన్నిసార్లు ఉద్యోగంలో ఉండే లక్ష్యాలతో ఇంటిని నిర్లక్ష్యం చేయొచ్చు. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో నలభై మూడు శాతం పురుషులు ఇదే అభిప్రాయాన్ని పేర్కొన్నారు. ఇదే కొందరి మహిళల్లో మానసిక వ్యాకులతను పెంచుతోంది. ‘ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కిచెన్‌లోకి వెళ్లిపోతాను. విశ్రాంతి తీసుకునే అవకాశం లేదు. పిల్లలతో గడపలేకపోతున్నానని వ్యథ. ఇంటిని సరిగ్గా పట్టించుకోవట్లేదనిపిస్తోంది. అందుకే ఉద్యోగం మానేసి.. గృహిణిగా బాధ్యతలు స్వీకరించాన’ని చెబుతూ చాలామంది  ఉద్యోగినులు ఉద్యోగం మాని ఇంటికే పరిమితమైపోయారు. అయితే ‘ఆర్థిక బాధ్యతలను పంచుకుంటున్న సహచరిణికి ఇంటి పనుల్లో ఏవిధంగా సాయం చేయగలరో భర్తలు ఆలోచించినప్పుడే మహిళల మానసిక కుంగుబాటు తగ్గుతుందన్నది నిపుణుల అభిప్రాయం. 
 
ఒత్తిడికి గురై సమస్యలతో బాధపడే వారిలో మహిళల సంఖ్య అధికమని అసోచామ్‌(అసోసియేటెడ్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఆఫ్‌ ఇండియా)తో సహా పలు సంస్థలు చేసిన అధ్యయనాలు వెల్లడించాయి. నిద్ర లేచింది మొదలు ఎన్నో పనులు. ఉద్యోగం, ఇంటి బాధ్యతలు ఊపిరి తీసుకోనివ్వవు. ఒత్తిడితో అధికరక్తపోటు, నెలసరి, ఊబకాయం, గర్భస్రావం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇవి మానసికంగా కుంగదీస్తుంటాయి. అన్నీ ఉన్నా.. తెలియని అసంతృప్తి. నెలసరి, గర్భస్రావ సమస్యలే కాక, మెనోపాజ్‌ దశలో స్త్రీలు ఎక్కువగా మానసిక వేదనకు గురవుతున్నారు. జీవనశైలిలో వచ్చిన మార్పులే సమస్యలకు మూలం. వీటి నుంచి బయటపడేందుకు క్రమబద్ధమైన జీవన విధానాన్ని అలవరచుకోవాలని అంటున్నారు అధ్యయనకర్తలు. 
 
సమస్యల గురించి చర్చించడం కన్నా పరిష్కారాల దిశగా అడుగులేయడమే ఉత్తమం అంటున్నారు మానసిన నిపుణులు. వాళ్లు చెప్పిన కొన్ని సూచనలు పాటిస్తే మహిళలకు కాస్త వెసులుబాటు కలుగుతుంది.
 
కంగారు, మతిమరుపు, నిద్రలేమి, సంతాన సాఫల్యసమస్య.. ఒత్తిడిని తెలిపే లక్షణాలు. అవి మీ మీద స్వారీ చేయడం మొదలుపెట్టాయని గ్రహించగానే... మానసిక విశ్రాంతి పొందే మార్గాలను ఆచరణలో పెట్టాలి. 
 
ఏ సమయంలో తినాలి... విశ్రాంతి తీసుకోవాలో రోజూవారీ ప్రణాళికను రూపొందించుకోండి. నూనె, తీపి పదార్థాలు, కాఫీ, టీ వంటి వాటిని తగ్గించి.. పోషకాహారానికి ప్రాధాన్యమివ్వాలి. 
 
రాణిలా బ్రేక్‌ఫాస్ట్‌... రాకుమారిలా మధ్యాహ్న భోజనం... పేదరాలిలా రాత్రి ఆహారం తీసుకోండి. వ్యాయామం, యోగా.. ధ్యానం.. శారీరకంగానే కాదు.. మానసికంగానూ మార్పుతెస్తాయి. 
 
రొమ్ము, గర్భాశయ పరీక్షలే కాదు.. ఇతర చెకప్‌లు.. క్రమం తప్పకుండా చేయించుకోవాలి. అవసరాన్ని బట్టి వైద్యుల సలహాతో పోషకాల సప్లిమెంట్లు వాడాలి. 
 
ఏదైనా అభిరుచిని నేర్చుకోవడం.. సత్సంగాలు.. సమాజసేవ.. తదితరాలకోసం కొంత సమయం తప్పనిసరి. 
 
కుటుంబం, స్నేహితులతో వీలైనంత ఎక్కువ సమయం గడపండి. 
 
మీ ఇబ్బందులు, బాధల్ని స్నేహితులు, భాగస్వామితో వివరించండి. ఉపశమనం లభిస్తుంది. అంతేగానీ ఈ సమస్యలకు ఉద్యోగం మానేయడం పరిష్కారం కాదని తెలుసుకోండి.
 
 ప్రతి సమస్యకు పరిష్కారాలుంటాయి. ఒత్తిళ్లను అధిగమించే ప్రత్యామ్నాయాలను అన్వేషించాలి. ఉద్యోగం, కుటుంబాన్ని సమన్వయ పరచుకొనే దిశలో పకడ్బందీ ప్రణాళికకు శ్రీకారం చుట్టాలి.